శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (19:02 IST)

క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు .. ఏపీ ఉప ముఖ్యమంత్రి

నిత్యజీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని, క్రీడలను అలవరుచుకోవలసిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం సెక్రటేరియట్, అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక  క్రీడా పోటీలను మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు తదితరులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... మన ప్రభుత్వం-మనది అనే భావనతో ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా ఒత్తిడిని అధిగమించి విధుల్లో చక్కని నిబద్ధతను చాటగలుగుతారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల అంకిత భావంతో ఉన్నారని, అందుకు నిదర్శనంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి రూ.10 లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వడం తార్కాణమన్నారు.

ప్రతి ఉద్యోగి నెలకొక మొక్కను నాటాలని మంత్రులు పిలుపునిచ్చారని అయితే నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకున్నప్పుడే ఫలితాలు ఉంటాయని, ఆ దిశగా ఉద్యోగులు కృషి చేయాలని ఆయన తెలిపారు. రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి అవంతిశ్రీనివాస్ మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి మరవరాదన్నారు.

ఒత్తిడిని అధిగమించడంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. పిల్లలను కూడా క్రీడల పట్ల తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. పాశ్చ్యాత దేశాల్లో వయసు పెరిగినా ఎంతో శారీరక ధృడత్వం కలిగి ఉంటారని అందుకు వారి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, క్రీడల పట్ల ఆసక్తి ఒక కారణమన్నారు. ఫిట్ నెస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనందరికీ ఆదర్శంగా నిలుస్తారన్నారు.

సమావేశాలున్నా, కార్యక్రమాలున్నా ప్రతి రోజు తప్పనిసరిగా ఒక గంట వ్యాయామానికి కేటాయిస్తారని అందుకు అనుగుణంగానే ఆయన దినసరి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 1500కి పైగా సచివాలయ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రంలోని 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 6 లక్షల మంది ఇతర ఉద్యోగులకు పరోక్షంగా ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామన్నారు. ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతినెల ఒక మొక్కనాటాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం నెలలో ఒకరోజును కేటాయించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 
 
క్రీడా శాఖ కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 19 క్రీడాంశాలలో 4 రోజుల పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 29న ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.

రాష్ట్రంలో జరిగే వేడుకల్లో 60 మంది ప్రముఖ క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానించడం జరుగుతుందన్నారు. ఆరోజు “ఫిట్ ఇండియా” కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరోజు ఉదయం సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్ తదితర క్రీడాంశాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

ఇందులో ఉద్యోగులు కూడా భాగస్వామ్యులు కావాలన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పేర్ని నాని, కొడాలి నాని, శాసన సభ్యులు జి.బిజేంద్ర రెడ్డి, రక్షణనిధి, కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, అప్స అధ్యక్షుడు మురళీకృష్ణ, అప్స  ప్రతినిధులు అప్పలనాయుడు, రామకృష్ణ, బి.ఇంద్రరాణి, తదితరులు పాల్గొన్నారు.