శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (06:17 IST)

కేటీఆర్ పట్టాభిషేకానికి రంగం సిద్ధం?.. సూపర్ సీఎంగా కేసీఆర్!

తెలంగాణలో అధికారిక టీఆర్ఎస్ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మంత్రి కేటీఆర్.. త్వరలో నెంబర్ వన్ స్థానంకు ప్రమోషన్ పొందనున్నట్లు సమాచారం. ఈ మేరకు గులాబీ బాస్ కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 
 
2020లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రగతి భవన్ సమాచారం. కొత్త సంవత్సర కానుకగా కేటీఆర్‌కు సీఎం కిరీటాన్ని తండ్రి కేసీఆర్ బహూకరించనున్నట్లు తెలుస్తోంది.
 
సూపర్ సీఎంగా కేసీఆర్!
ఒక వేళ కేటీఆర్ ముఖ్యమంత్రిగా వెళితే మరి కేసీఆర్ పరిస్థితి ఏంటనేది చాలామందిలో నెలకొన్న అనుమానం. కొడుకు కేటీఆర్ సీఎం అయితే... తండ్రి కేసీఆర్ సూపర్ సీఎం స్థానంలో ఉంటారని ప్రగతి భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం.

అంటే యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉండి, యూపీఏ ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ ఎలా అయితే ఉన్నారో కేసీఆర్ కూడా రాష్ట్రస్థాయిలో అలాంటి పదవిని అధిష్టిస్తారని సమాచారం. ఒక వేళ కేటీఆర్ ముఖ్యమంత్రిగా వెళితే మరి కేసీఆర్ పరిస్థితి ఏంటనేది చాలామందిలో నెలకొన్న అనుమానం.
 
ఇదే సూపర్ సీఎం టీమ్ 
ఇక సూపర్ సీఎం టీమ్‌లో లేదా సలహా మండలిలో ఛైర్మెన్‌గా కేసీఆర్, కొత్త సీఎంగా కేటీఆర్, ఇతర మంత్రులు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు డిప్యూటీ ఛైర్మెన్ బి.వినోద్ కుమార్, ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మతో పాటు మరికొందరు ముఖ్యులు ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రభుత్వం ఏదైనా అంశంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ అంశం ఈ సలహామండలి వద్దకు ముందుగా వెళుతుంది. అక్కడ చర్చించిన తర్వాతే దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సలహామండలికి ఛైర్‌పర్సన్‌గా కేసీఆర్‌ ఉంటారు కనుక ఆయన అభీష్టంమేరకే నిర్ణయం జరుగుతుంది.

అంతేకాదు పాలనాపరమైన అంశాలపై ఏమంత్రి అయినా, అధికారితోనైనా చర్చించే సర్వాధికారాలు కేసీఆర్‌కు ఉంటాయని సమాచారం. అంటే మొత్తం మీద సలహామండలి ఒక పవర్‌ఫుల్ మండలిగా తయారు కానుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు పలువురు మంత్రులు, నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజయవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రగతిభవన్లో  కేటీఆర్ కు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.