గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

గోదావరి జిల్లాలో జోరుగా కోళ్ల పందేలు... రూ.కోట్లలో బెట్టింగ్స్

సంక్రాంతి పండుగ అంటేనే కోళ్ల పందేలు. ఎవరు ఎన్ని చెప్పినా... కోర్టులు వివిధ రకాల అంక్షలు విధించినా పట్టించుకునే నాథుడే ఉండరు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. పోలీసుల హెచ్చరికలు గాల్లో కలిసిప

సంక్రాంతి పండుగ అంటేనే కోళ్ల పందేలు. ఎవరు ఎన్ని చెప్పినా... కోర్టులు వివిధ రకాల అంక్షలు విధించినా పట్టించుకునే నాథుడే ఉండరు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. పోలీసుల హెచ్చరికలు గాల్లో కలిసిపోయాయి. ఫలితంగా భోగి పర్వదినమైన ఆదివారం నాడు ఉభయ గోదావరి జిల్లాల్లో సంప్రదాయం పేరిట మొదలైన కోళ్ల పందేలు జోరుగా సాగుతుండగా, డిక్కీ పందేలు (కోళ్లకు కత్తులు కట్టకుండా సాగే పందేలు), ఇప్పుడు కత్తుల పందేలుగా మారిపోగా, నిమిషాల వ్యవధిలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. 
 
ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని పాలకొల్లు, కాకినాడ, భీమవరం, వెంప, ఏలూరు, తాడేపల్లిగూడెం, గుడివాడ తదితర ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు సాగుతున్నాయి. ఆదివారం ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభయంతో తొలుత కత్తులు కట్టని పందేలను ప్రారంభించిన నిర్వాహకులు, ఆపై కత్తులు కట్టిమరీ పందేలు వేస్తున్నారు. 
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. రైతులకు కొత్త పంటలు చేతికి వచ్చిన వేళ, చెరుకు గడలు, పూలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు పలకరిస్తున్న వేళ, భోగి మంటలతో ప్రజలు సంక్రాంతిని స్వాగతించారు. ప్రతి ఊరిలో, పట్టణంలో వీధివీధుల్లో భోగి మంటలు కనిపిస్తున్నాయి.
 
పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతాల్లో నిర్వహించిన సంబరాల్లో వారు పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం వీధుల్లోకి వచ్చి భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. భోగి వేడుకలు అంబరాన్ని అంటుతున్న వేళ, మంటల చుట్టూ కోలాటాలు ఆడుతూ పండక్కి స్వాగతం పలికారు. పలువురు ఏపీ మంత్రులు భోగి మంటల ముందు చిన్నారులను కూర్చోబెట్టి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు.