మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:27 IST)

వినియోగ‌దారులూ త‌స్మాత్ జాగ్ర‌త్త‌... అంటున్న ఆస‌రా సంస్థ‌!

వినియోగ‌దారులూ త‌స్మాత్ జాగ్ర‌త్త అంటోంది... ఆస‌రా స్వ‌చ్ఛంద సంస్థ‌. మీరు కొనే ప్ర‌తి వ‌స్తువులో నాణ్య‌త‌, ప‌రిమాణం, ధ‌ర‌లను నిజాయితీగా అందించే వారి వ‌ద్దే కొనుగోలు చేయాల‌ని సూచిస్తోంది. ఎవ‌రైనా వినియోగ‌దారులు మార్కెట్లో మోస‌పోతే వారికి మేం అండ‌గా నిలుస్తామ‌ని, న్యాయ‌పోరాటం వారి త‌ర‌ఫున చేస్తామ‌ని పేర్కొంటున్నారు ఆస‌రా కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ త‌రుణ్ కాకాని.

 
త్వ‌ర‌లో వినియోగ‌దారుల చైత‌న్యానికి, వారికి న్యాయ స‌హాయం, ఆస‌రా అందించ‌డానికి మొబైల్ వ్యానులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. వ‌స్తువుల నాణ్య‌త‌, కొల‌త‌ల్లో తేడాల‌ను పరిశీలించి, వినియోగ‌దారుల‌ను చైత‌న్యం చేసే ఆస‌రా సంస్థ కృష్ణా జిల్లా లీగ‌ల్ మెట్రాల‌జీ శాఖ కంట్రోల‌ర్ కృష్ణ చైత‌న్య‌ను క‌లిసింది. సంస్థ గ‌త ఆరు నెల‌ల్లో నిర్వ‌హించిన కార్య‌క‌లాపాలపై లీగ‌ల్ మెట్రాల‌జీ శాఖ కంట్రోల‌ర్ కు నివేదిక స‌మ‌ర్పించింది.

 
కృష్ణా జిల్లా విజ‌య‌వాడ‌తోపాటు గుడివాడ‌, నూజివీడు, మ‌చిలీపట్నంలో వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌పై ఆస‌రా చేసిన అధ్య‌య‌నం, బాధితుల‌కు అందించిన సూచ‌న‌లు, స‌ల‌హాల‌పై కంట్రోల‌ర్ కృష్ణ చైత‌న్య‌కు వివ‌రించారు. ఆస‌రా జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ తరుణ్ కాకాని, రాష్ట్ర ఇ.సి. స‌భ్యుడు, జిల్లా ఇన్‌ఛార్జి మ‌ధు కోనేరు, ఉపాధ్య‌క్షురాలు శిరీష చెరుకూరి, కార్య‌ద‌ర్శి ప్ర‌కాష్ చ‌లువాది, స‌భ్యుడు న‌రేష్ నామ‌గిరి త‌దిత‌రులు ఈ నివేదిక‌ను లీగ‌ల్ మెట్రాల‌జీ శాఖ‌కు అందించారు. 

 
వినియోగ‌దారుల‌ను చైత‌న్య ప‌ర‌చ‌డంలో ఆస‌రా కృషిని కృష్ణా జిల్లా లీగ‌ల్ మెట్రాల‌జీ శాఖ కంట్రోల‌ర్ కృష్ణ చైత‌న్య అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఆస‌రా అధ్య‌క్షుడు త‌రుణ్ కాకాని మాట్లాడుతూ, వినియోగ‌దారులు త‌మ ఫిర్యాదుల‌ను తెలిపేందుకు, స‌ల‌హాలు పొందేందుకు ఆస‌రా సంస్థ టోల్ ఫ్రీ నెంబ‌రు 18008899895 ఏర్పాటు చేసింద‌ని పేర్కొన్నారు. దీనికి కాల్ చేసి, వినియోగ‌దారులు నేరుగా త‌మ ఫిర్యాదుల‌ను తెలుప‌వ‌చ్చ‌న్నారు. దీనితో వినియోగ‌దారుల్లో చైత‌న్యం కోసం కృష్ణా జిల్లా నూజివీడు, గుడివాడ‌, మ‌చిలీప‌ట్నం, కంకిపాడుల‌లో ఈ నెల‌లో మొబైల్ ఆస‌రా వ్యాన్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు.