జమ్మలమడుగు బాంబులతో చంపుతా... డీఈపై రౌడీ కాంట్రాక్టర్ దాడి
కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదన్న అక్కసుతో ప్రభుత్వం డీఈపై కాంట్రాక్టర్ దాడికిపాల్పడ్డాడు. పట్టపగలు, అందరూ చూస్తుండగా రోడ్డుపై పడేసి కాలితో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చే
కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదన్న అక్కసుతో ప్రభుత్వం డీఈపై కాంట్రాక్టర్ దాడికిపాల్పడ్డాడు. పట్టపగలు, అందరూ చూస్తుండగా రోడ్డుపై పడేసి కాలితో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు. దీంతో డీఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రౌడీ కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతపురం మునిసిపాలిటీలో రోడ్లు ఊడ్చేందుకు యేడాదిగా ఒక యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. దీని కాంట్రాక్టర్ వినయ్ కుమార్. ఆయన తరపున నరసింహా రెడ్డి మునిసిపల్ కార్యాలయానికి వచ్చేవారు. వారం రోజుల నుంచీ బిల్లుకు సంబంధించిన పత్రాలపై సంతకాల కోసం నరసింహా రెడ్డి ఆఫీసుకు తిరుగుతున్నాడు. సోమవారం సాయంత్రం ఏఈ మహదేవను కలిసేందుకు నరసింహా రెడ్డి డీఈ కార్యాలయానికి వచ్చాడు. ఏఈతో గొడవకు దిగాడు.
ఈక్రమంలో అక్కడే ఉన్న వాటర్ వర్క్స్ డీఈ కిష్టప్ప జోక్యం చేసుకున్నారు. ఆఫీసులో గొడవ చేయొద్దని నరసింహా రెడ్డికి సూచించారు. నరసింహా రెడ్డి తిట్టుకుంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయారు. అంతలోనే కార్యాలయంలో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న డీఈ కిష్టప్పను నరసింహా రెడ్డి తన అనుచరులతో వెంబడించారు. నామా టవర్స్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న డీఈని నరసింహా రెడ్డి కారులో వెళుతూ మెడపై కొట్టాడు. అక్కడితో ఆగకుండా... మళ్లీ వెంబడించి రఘువీరా టవర్స్ వద్ద ఆపి కిందికి తోశాడు. కాలితో పదేపదే తన్నాడు. బూతులు తిట్టాడు. కొడవలితో నరికేస్తానని బెదిరించాడు.
"కొడవలీయండ్రా.. నా కొడుకును నరికేస్తా! కొడకా.. నేనెవరో తెలుసా! మాది ప్రొద్దుటూరు. జమ్మలమడుగు బాంబులతో చంపుతా ఏమనుకున్నావో! కర్నూలు జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేల కొడుకులు నాకు ఫ్రెండ్స్. ఏమనుకున్నార్రా.. నాకు రావాల్సిన బిల్లు చేయమని అడిగితే.. నీకేమిరా కొడకా! నాకు అడ్డం పడతావా.. నీకు దిక్కెవర్రా! చంపేస్తా నా కొడకా"... అంటూ డీఈని రౌడీ కాంట్రాక్టర్ నరసింహా రెడ్డి దుర్భాషలాడారు.
ఈ వ్యవహారం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో సంచలనమైంది. తనపై దాడికి సంబంధించి డీఈ కిష్టప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కాంట్రాక్టర్’ నరసింహారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి ఘటనకు నిరసనగా మంగళవారం మునిసిపల్ సిబ్బంది ప్రదర్శన నిర్వహించారు. వీరికి మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంఘీభావం ప్రకటించారు.