1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (10:23 IST)

ఏపీలో 329 మందికి కరోనా పాజిటివ్.. ఏ జిల్లాలో ఎంతమందికి సోకిందంటే?

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఉదయం 15 కొత్త కేసులు బయల్పడ్డాయి.దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 329 కి చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 49, గుంటూరు జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 35, వైయస్సార్‌ కడప జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలలో 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలలో 21, విశాఖపట్నం జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 6 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.

కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 6 గురు డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున, కృష్ణా జిల్లాలో ఇద్దరు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం  వైయస్‌ జగన్‌ సమీక్ష:
హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్‌ సర్వేపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. విశాఖలో మాదిరిగా ర్యాండమ్‌ సర్వేలు జరగాలని, క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్న సదుపాయాలు, వసతులను పెంచడానికి ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.

క్రిటికల్‌ కేర్‌ కోసం నిర్దేశించిన కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే జిల్లాల వారీగా నిర్దేశించుకున్న కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆయా ఆస్పత్రుల్లో సదుపాయాల్లో నాణ్యత ఉండాలని, ఇప్పటికే రూపొందించుకున్న ఎస్‌ఓపీ ప్రకారం.. ప్రమాణాలు పాటించాలని సీఎం ఆదేశించారు.

వచ్చే సోమవారం నాటికి అనుకున్న ప్రమాణాల ప్రకారం వీటన్నింటిలోనూ వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇక క్వారంటైన్లు, క్యాంపుల్లో కూడా మరోసారి వసతులన్నీ పరిశీలించి ఎక్కడైనా మెరుగుపరచాల్సిన అంశాలు ఉంటే.. వెంటనే వాటిపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 
 
జిల్లాల వారీగా వివరాలు:

శ్రీకాకుళం జిల్లా:
– కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా కరోనా నిరోధక టన్నెల్‌ (కరోనా వైరస్‌ నాశనం చేసే స్ప్రేయింగ్‌ గది) ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాగం. 
– 80 ఫీట్ రోడ్డులో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో టన్నెల్‌ ప్రారంభించిన కలెక్టర్‌ జె.నివాస్‌.
– టన్నెల్‌ ద్వారం వద్ద కరోనా వైరస్‌ వ్యాప్తికి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన.
– ఇక నుంచి జిల్లాల్లోనే కరోనా నమూనాల పరీక్షల నిర్వహణ. ఆ మేరకు జిల్లాలోనీ క్షయ నమూనాల పరీక్షల కేంద్రాలను కరోనా నమూనాల పరీక్షల కేంద్రంగా మార్పు చేయనున్నారు.
– ఢిల్లీ, ముంబై వెళ్ళి వచ్చిన వారి వివరాలు ఎయిర్‌లైన్స్, రైల్వే తదితర సంస్ధల నుండి తీసుకుని, వారి ఇళ్లకు వెళ్లి మొబైల్‌ బృందాలతో పరీక్షిస్తున్నారు.
– నిన్న ఒక్కరోజే 134 శాంపిల్స్‌ సేకరణ.
– క్వారంటైన్‌లో ఉన్న వారిని పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారుల నియామకం.
– ప్రతి మందికి ఒక వైద్యుడిని నియమించి, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
 
విజయనగరం జిల్లా:
– పట్టణంలో పారిశుద్ధ్య సేవలందిస్తున్న కార్మికులకు స్థానిక ఆనంద గజపతి రాజు ఆడిటోరియంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
– కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి, మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ.
– జిల్లాలోని కోవిడ్‌ ఆసుపత్రిగా రూపొందించిన మిమ్స్‌ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్‌. డాక్టర్లకు పలు సూచనలు. 
– ఈ వారం రోజుల లాక్‌డౌన్‌ అత్యంత కీలకమని, కనీసం రెండింతలు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో సూచించిన మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ. 
– జిల్లాలో ఈనెల 5వరకు 104 శాంపిల్స్‌ పరీక్షకు పంపించగా, 64 నెగటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయి.
–  క్వారంటైన్‌ కేంద్రాల్లో 4500 బెడ్లు ఏర్పాటు.
– ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న వారికి మంచి ఆహారం సరఫరా.
– జేఎన్‌టీయూలో 113 మందిని అబ్సర్వేషన్‌లో ఉంచగా, వారిని మరో వారం రోజుల్లో పూర్తి పరీక్షలు చేసి ఇళ్లకు పంపించనున్నారు.
– ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండి పోయిన విద్యార్థులు, తీర్ధ యాత్రికులు, వలస కార్మికులు, బిచ్చగాళ్లు, అనాధలకి 34 కేంద్రాలు ఏర్పాటు.
– వాటిలో 3500 మందికి భోజనం, వసతి కల్పన.
 
విశాఖపట్నం జిల్లా:
– జిల్లాలో తాజాగా కరోనా అనుమానిత శాంపిల్స్‌ 600 పరీక్షకు పంపించగా, 11 కేసులు నెగటివ్‌గా నిర్ధారణ.
– దీంతో ఇప్పటి వరకు నెగటివ్‌గా తేలిన 483 కేసులు.
– 20 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇంకా 97 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– జిల్లాలో గతంలో 13 రైతు బజార్లు ఉండగా, వాటిలో రద్దీ తగ్గించేందుకు 81 తాత్కాలిక రైతు బజార్లతో పాటు, 52 మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేశారు.
– దీంతో మొత్తం 146 రైతు బజార్ల ద్వారా ప్రజలకు కూరగాయలు, ఇతర ముఖ్య నిత్యావసరాలు అందుతున్నాయి.
 
తూర్పు గోదావరి జిల్లా:
– జిల్లా నుంచి కరోనా అనుమానిత శాంపిల్స్‌ 619 పరీక్షకు పంపారు.
– వాటిలో 465 శాంపిల్స్‌ నెగటివ్‌గా రాగా, 11 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఇంకా 143 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– జిల్లాలో 14.65 లక్షల కుటుంబాలను హౌస్‌ టు హౌస్‌ సర్వే టీములు సందర్శించి మొత్తం 17409 మందిని కోవిడ్‌–19 సర్వైలెన్స్‌లో ఉంచారు.
– వారిలో 9905 మంది 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకోగా, మరో 7085 మంది 15 నుండి 28 రోజుల పర్యవేక్షణ కాలంలో ఉన్నారు. ఇంకా 419 మంది 14 రోజుల లోపు పర్యవేక్షణలో ఉన్నారు. 
– జిల్లాలో 165 క్వారంటైన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. 
– వేర్వేరు ఆస్పత్రుల్లో 6,509 ఐసోలేషన్‌ బెడ్లు సిద్ధం చేశారు.
– 3442 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లోను, 40 మందిని క్వారంటైన్‌ కేంద్రాలలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.  
– కరోనా వైరస్‌ అనుమానిత కేసుల నుంచి శాంపిల్స్‌ సేకరణకు మొబైల్‌ టీమ్‌లు ఏర్పాటు చేశారు.
 
పశ్చిమ గోదావరి జిల్లా:
– జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ అనుమానిత శాంపిల్స్‌ 502 సేకరించి పరీక్షలకు పంపగా, వాటిలో 279 కేసులు నెగటివ్‌గా తేలాయి.
– 21 కేసులు పాజిటివ్‌గా గుర్తించగా, మరో 202 కేసుల ఫలితాలు రావాల్సి ఉంది.
– జిల్లాకు విదేశాల నుంచి 4821 మంది రాగా, వారందరినీ ట్రాక్‌ చేశారు. వారంతా స్వీయ గృహ నిర్భంధంలో ఉన్నారు. 
 
కృష్ణా జిల్లా:
– జిల్లాలో తాజాగా మరే కేసు నమోదు కాలేదు. కాగా, ఇప్పటి రకు 29 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించారు.
– ఇప్పటివరకు జిల్లాలో 549 మందికి పరీక్షలు నిర్వహించగా, 245 మందికి నెగటివ్‌ రాగా 29 మందికి పాజిటివ్‌ అని వచ్చింది. మరో 275 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
– రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ కట్టుదిట్టంగా అమలు అవుతోంది. ప్రజలు ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. నిత్యావసర వస్తువులను వారి ఇళ్ల వద్దకే పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 
– మచిలీపట్నంలోని రెడ్‌ జోన్‌ ప్రాంతంలో మంత్రి శ్రీ పేర్ని నాని పర్యటించారు.
– రెడ్‌ జోన్‌ పరిధిలోని అన్ని రహదారులు, డ్రైయిన్లను హైపో క్లోరైడ్‌తో పిచికారి చేయాలని మున్సిపల్‌ శానిటేషన్‌ సిబ్బందిని ఆదేశించారు. 
– గుడివాడ పట్టణంలో లాక్‌ డౌన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. 
– గుడివాడ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
– విదేశాలు, ఢిల్లీ జమాత్‌ సభలకు వెళ్లి వచ్చిన వారిలో కొందరిని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు.
 
గుంటూరు జిల్లా:
– ఇప్పటి వరకు జిల్లాలో 32 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా తాజాగా మంగళవారం సాయంత్రం మరో కేసు గుర్తించారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33కి చేరింఇ.
– జిల్లాలో మొత్తం 525 శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపగా, వాటిలో పాజిటివ్‌–33, నెగెటివ్‌–424 రాగా, ఇంకా 68 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– పాజిటివ్‌గా వచ్చిన కేసుల్లో ఫారిన్‌ రిటర్న్‌–8, ఫారిన్‌ కాంటాక్ట్‌–1, ఢిల్లీ రిటర్న్‌–200, ఢిల్లీ కాంటాక్ట్‌–77 ఉండగా, మిగిలిన వారు మరో 16 మంది ఉన్నారు.
– గుంటూరు టౌన్‌–19, మాచర్ల–5, అచ్చంపేట–3, క్రోసూరు–1, కారంపుడి–1, మంగళగిరి–2, మరి కొన్ని ప్రాంతాలలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
– జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ సోకిన వారి చికిత్స కోసం ముందు జాగ్రత్తగా 9500 బెడ్లు సిద్దం చేశారు.
– తాజాగా గుంటూరు మిర్చి యార్డు ప్రాంతం ఉన్న శ్రీనివాసరావు తోటలో పాజిటివ్‌ కేసు నమోదవ్వడంతో, దాన్ని కంటెయిన్‌మెంట్‌ పరిధిలోకి తెచ్చారు.
– దీంతో మిర్చి యార్డును కూడా ఈనెల చివరి వరకు మూసివేయనున్నారు.
– జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల్లో 486 మంది ఉండగా, ఫారిన్‌ రిటర్న్‌ 1065 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.
 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
– జిల్లాలో 42 పాజిటివ్‌ కేసులు నమోదు.
– శాంతియుతంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న పోలీసులు.
– ఇంటి వద్దే ఫోటో తీస్తున్న వార్డు వలంటీర్లు లబ్ధిదారులను పెన్షన్‌ అందజేస్తున్నారు.
– జిల్లాలో పక్కాగా పారిశుద్ధ్యం అమలు.
– జిల్లాలో హోం ఐసోలేషన్‌లో 896 మంది.
– ఆసుపత్రి క్యారంటైన్‌లో 105 మంది ఉండగా, ఆసుపత్రి హోం ఐసోలేషన్‌లో మరో 14 మంది.
– జిల్లాకు విదేశాల నుంచి 1700 మంది రాక.
– కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స చేసేందుకు హోం ఐసోలేషన్‌లో 2,200 బెడ్లు సిద్ధం.
 
చిత్తూరు జిల్లా:
– జిల్లాలో కొత్తగా పాజిటివ్‌ కేసు ఏదీ నమోదు కాలేదు.
– ఇంకా 68 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– పలమనేరు మండలం ఆవులపల్లి వద్ద కరోనా వైరస్‌ దూరం కావాలంటే ఉమ్మెత్త కాయలు తినాలని టిక్‌ టాక్‌ సందేశం రావడంతో ఆ పని చేసి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 11 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉంది.
– విదేశాల నుంచి వచ్చిన వారిలో 1779 మంది హోమ్‌ ఐసోలేషన్‌ నుంచి విడుదల కాగా, ఇంకా 37 మంది మాత్రమే ఉన్నారు.
– ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు 1741 మందికి వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తున్నారు.
– కాణిపాకంలోని గణేశ సదన్‌లో క్వారన్‌టైన్‌ సెంటర్‌ ఏర్పాటులో కొంత వివాదం ఏర్పడింది. ఆలయంలోకి అన్య మతస్తులను అనుమతించారని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. గుడిలో నుంచి అన్య మతస్తులు బయటకు వచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు.
 
అనంతపురం జిల్లా:
– జిల్లాలో లాక్‌ డౌన్‌  ఉల్లంఘనదారులపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
– జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 1688 మందిపై 954 కేసులు నమోదు చేశారు.
– 23,520 ఎంవి కేసులు నమోదు చేసి, 489 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
– ఇంకా రూ. 1,06,80,945 అపరాధ రుసుము విధించారు.
– అనంతపురం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తనిఖీ చేశారు.
– జిల్లా కేంద్రంలోని తాడిపత్రి బస్టాండ్‌ వద్ద కరోనా వైరస్‌ కట్టడి నివారణలో భాగంగా అధునాతన పిచికారి స్ప్రేయింగ్‌ మిషన్‌ ద్వారా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేశారు.
 
వైయస్సార్‌ కడప జిల్లా:
– జిల్లాలో ఇప్పటి వరకు 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
– జిల్లాలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ చర్యలు పటిష్టవంతంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన అధికారులతో పరిస్థితి సమీక్షించారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మాట్లాడుతూ.. కోవిద్‌–19 పాజిటీవ్‌ కేసులకు వైద్యం అందించే వార్డుల్లో స్మార్ట్‌ ఫోన్లు వాడకాన్ని నిషేధించాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌.. వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని, సంబందిత అధికారులతో మాట్లాడి అమలు చేస్తామన్నారు.
కడప పార్లమెంటు సభ్యులు శ్రీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో కోవిద్‌–19 నివారణ కోసం చేపడుతున్న లాక్‌ డౌన్‌ కారణంగా జిల్లాలో సాగులోవున్న వ్యవసాయ రైతులు కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అరటి, చీనీ పంట దిగుబడి ఎక్కువగా ఉందని, దిగుబడి అమ్మకానికి సరిగా ట్రాన్స్‌ పోర్టు సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చొరవతో ఇతర రాష్ట్రాలకు పంట ఎక్సపోర్టు జరుగుతున్నా... ఏప్రిల్, మే నెలల్లో అధికంగా  దిగుబడి అందుతుందని.. ఒక్కసారిగా మార్కెటింగ్‌ శాఖకు కూడా ట్రాన్సో్పర్టు చేయడం వీలుకాక పోవచ్చన్నారు. కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.
అదే విధంగా ప్రజా ఆవసరాల దృష్ట్యా.. అన్ని మెడికల్‌ షాపుల్లో.. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. అందుకు బదులిచ్చిన మంత్రి ఆళ్ల నాని.. జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు ఇప్పటికే జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 50 వేల చొప్పున మాస్కులు సరఫరా చేశామని చెప్పారు.
 
కర్నూలు జిల్లా:
– కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉన్న అధిక మందిని  ప్రైమరీ, సెకండరీ స్టేజిల్లో కర్నూలు జిల్లా  రాయలసీమ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటి కళాశాలలో క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.
– వారికి  పరీక్షలను నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ అన్ని వసతులను అధికారులు కల్పించారు.
– జిల్లాలో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో వారికి సంబందించిన వ్యక్తులతో పాటు సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల కోసం 14 నియోజకవర్గాల్లో ప్రభుత్వ  క్వారౌటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
– ప్రభుత్వ  క్వారంటైన్‌ కేంద్రాలలో 600 మందికి పైగా ఉన్నందున వారికి అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్య, ఆరోగ్య సిబ్బందితో పర్యవేక్షించేందుకు అన్ని సంక్షేమ హాస్టళ్ళ వెల్ఫేర్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
– మూడు షిప్ట్‌ల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించేలా పటిష్ట ప్రణాళికను జిల్లా ఉన్నతాధికారులు రూపకల్పన చేశారు.