శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 23 జులై 2020 (15:07 IST)

పెళ్ళికొడుకుని ముస్తాబు చేసిన బంధువులు, పెళ్ళికొడుక్కి కరోనావైరస్, చివరకు?

తూర్పుగోదావరిజిల్లా కొత్తపేటలో పెళ్ళింట కరోనావైరస్ కలకలం రేపింది. కొత్తపేటకు చెందిన యువకుడికి పక్కనే ఉన్న బిల్లకుర్రుకు చెందిన యువతికి పెళ్ళి నిశ్చయమైంది. 15 రోజుల ముందు రెండు కుటుంబాలు పెళ్ళికి సంబంధించిన నిశ్చయం చేసేసుకున్నారు. రేపు పెళ్ళి జరగాల్సి ఉంది. 
 
పెళ్ళికొడుకుని సిద్ధం చేశారు బంధువులు. అయితే ఉన్నట్లుండి ఒక మెసేజ్ ఆ పెళ్ళిని ఆపేసింది. యువకుడికి కరోనావైరస్ పాజిటివ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోగా పెళ్ళికొడుకుని రెడీ చేసిన బంధువులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఇటీవల సంచార సంజీవిని బస్సులో నిర్వహించిన రాపిడ్ యాంటీజన్ కిట్ పరీక్షల్లో యువకుడు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. రేపు ఉదయం పెళ్ళి అనగా ఈరోజు మధ్యాహ్నానికి అతని మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినట్లు మెసేజ్ రావడంతో ఆంబులెన్స్ తీసుకొచ్చి పెళ్ళికొడుకుని ఆసుపత్రికి తరలించారు.
 
అతనితో పాటు అతన్ని ముందుగా ఈ రోజు ఉదయం నుంచి ముస్తాబు చేసిన బంధువులను క్వారంటైన్లకు తరలించారు. గత వారం రోజుల నుంచి కొంతమంది స్నేహితులు ఆ యువకుడితో కలిసి ఉండటంతో వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు వైద్య సిబ్బంది. పెళ్ళింట కరోనా కలకలం సృష్టించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.