ఎంత కష్టం? కరోనా సోకినా పిపిఇ కిట్ ధరించి నాయనమ్మ అంత్యక్రియలు చేసిన ఒక్క మనవుడు
భయంతో కావాల్సిన వారిని కనీసం కడసారి చూపుకైనా నోచుకోని పాడుకాలం కరోనా కాలం. పాడె మోసేందుకు నలుగురు బంధువులు కరువవుతున్న పాడుకాలం. ఊరంతా బంధువుల బలంగా ఉన్నా ఆ వృద్ధురాలి దహన సంస్కారాలను చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
చివరికి కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె మనవడే పీపీఈ కిట్ వేసుకొని వచ్చి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ విషాద ఘటన ఆలస్యంగా నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల గ్రామంలో చోటుచేసుకుంది. ఉప్పుల రామ నరసమ్మకు ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే కొడుకులందరూ మృతి చెందారు. దీంతో ఆ వృద్ధురాలు ప్రస్తుతం రెండో కుమారుడి కొడుకు శ్యామ్ సుందర్ రెడ్డి దగ్గర ఉంటోంది.
ఉప్పుల రామ నరసమ్మ అనారోగ్యం కారణంగా ఆదివారం ఆమె మృతిచెందింది.ఇ దే సమయంలో ఆమె మనవడు శ్యామ్ సుందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు బంధువులు, గ్రామ పంచాయితీ సిబ్బంది, అధికారులు ముందుకు రాలేదు. తన నాయనమ్మకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు చెయ్యాలని నెగిటివ్ వస్తే అంత్యక్రియలు చేసుకుంటామని గ్రామ పంచాయితీ సర్పంచ్, రెవిన్యూ, వైద్య, పోలీసు అధికారులను ఎంత వేడుకున్నా స్పందించలేదు.
దీంతో కరోనా సోకి ఇబ్బంది పడుతున్న మనవడు పుట్టెడు కష్టంలో ఒక్కడే పిపిఇ కిట్ ధరించి నాయనమ్మను కారులో కాటికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమెకు కూడా కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో మృతదేహాన్ని చూసేందుకు కూడా బంధువులు, గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు. ఆదివారం కావటంతో పాటు, సిబ్బంది కొరత ఉండటంతో వృద్ధురాలి అంత్యక్రియలు చేయలేకపోయామని అంటుంది పంచాయితి కార్యదర్శి.