గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (10:50 IST)

విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 1,129 మంది మృతి.. 12లక్షల మార్కు వద్ద..?

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,129 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా కొత్తగా 45,270 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో ఇన్ని కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,38,635కి చేరింది.
 
మొత్తం నమోదు అయిన కేసుల్లో 7,82,607 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,26,167 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 63.13శాతంగా ఉంది. నిన్నటి వరకు మొత్తం 1,50,75,369 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 
 
అలాగే దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ 3.2లక్షల కేసులు నమోదు కాగా.. 12,276 మంది మరణించారు. తమిళనాడులో 1.81లక్షల కేసులు నమోదు కాగా.. 2,626 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 1.25లక్షల కేసులు నమోదు కాగా.. 3,690 మంది మరణించారు. 
 
ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. భారత్‌ కంటే ముందు అమెరికా, బ్రెజిల్‌ ఉన్నాయి. ఇక అత్యధిక మరణాలు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.