శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (10:09 IST)

డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి - 40 వేల బలగాల మొహరింపు :: అప్రమత్తమైన భారత్

చైనా తన వంకర బుద్ధిని మరోమారు చూపించింది. గుట్టుచప్పుడు కాకుండా 40 వేల అదనపు బలగాలను ఇండో-చైనా సరిహద్దు ప్రాంతానికి తరలించింది. ఈ విషయాన్ని పసిగట్టిన భారత్ మరింత అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు భారీ సంఖ్యలో బలగాలను తరలిస్తోంది. అలాగే వైమానిక దళాన్ని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అప్రమత్తం చేశారు. 
 
ఒకవైపు భారత్‌తో శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవలే తూర్పు లడఖ్‌ సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి భారత జవాన్లపై దాడికి పాల్పడ్డాయి. ఇందులో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల తర్వాత ఆ ప్రాంతం నుంచి చైనా తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. 
 
ఇంతలోనే డ్రాగన్ కంట్రీ తన వక్ర బుద్ధిని మరోమారు చూపించింది. గాల్వన్‌లోయ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ఘటనలు మరవకముందే అరుణాచల్‌ ప్రదేశ్‌ మెక్‌మోహన్‌ రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఆ ప్రాంతం వద్ద సుమారు 40 వేల మంది సైనికులను చైనా మోహరించిందని సమాచారం. మెక్‌మోహన్‌ దిశ రేఖగా చైనా సైన్యం కదలికలతో భారత్ అప్రమత్తమైంది.
 
బలగాల ఉపసంహరణపై చైనా మరోసారి మాట తప్పడంతో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడితే ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండేందుకు భారత్ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి పోరాట సామగ్రితో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు బలగాలు, ఇతర యుద్ధ సామగ్రిని తరలిస్తోంది.
 
దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రిజర్వ్‌ బలగాల సమీకరిస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. చైనా సైనికుల కదలికలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది. భారత్‌తో ఇటీవల జరిగిన ఒప్పందానికి కట్టుబడకపోవడమే కాకుండా చైనా సైన్యం మరింత ఉద్రిక్తతలు చెలరేగేలా తన చర్యలకు కొనసాగిస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.