విశాఖ ఉక్కుపై లేఖ రాసి చేతులు దులుపుకుంటానంటే ఎలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై లేఖ రాసి చేతులు దులుపుకుంటానంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉక్కు సంకల్పంతో పోరాటం చేయాలని ఆయన కోరారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రత్యేక ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఈ అంశంపై త్వరలోనే రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామన్నారు.
అలాగే హైదరాబాద్‌లో సంఘీభావ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను ఒక పాలసీగా పెట్టుకుందన్నారు. ట్రేడ్ యూనియన్లు, రాజకీయపక్షాలతో ఏసీ బీజేపీ కూడా వ్యతిరేకిస్తోందని చెప్పారు.
ఢిల్లీకి వెళ్లిన బీజేపి నేతలు స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకున్నాకే విశాఖ రావాలన్నారు. వట్టి చేతులతో వస్తే ప్రజల్లోకి ఓట్లు అడిగేహక్కులేదని పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఆరున్నర సంవత్సరాల కాలంలో ఏపీకి ఏచిన్న ప్రయోజనం చేకూరలేదని మండిపడ్డారు. సీఎం జగన్ ఉత్తరం రాస్తే సరిపోదన్నారు. అఖిలపక్షాలతో సమావేశమై... అందర్నీ ఢిల్లీ తీసుకు వెళ్లి పోరాటం చేయాలని సూచించారు.