ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (21:54 IST)

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ : సంచలన నిర్ణయం తీసుకున్న గంటా!

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతుంది. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ ఉద్యమానికి మరింతగా ఊపునిచ్చేలా తెదేపాకు చెందిన శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయలేదని, అందువల్ల అది చెల్లుబాటు కాదనే విమర్శలు వస్తున్నాయి. 
 
వీటికి ఈ మాజీ మంత్రి గంటా వివరణ ఇచ్చారు. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ పాపంలో అన్ని రాజకీయపార్టీల పాత్ర ఉందని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అందరూ పోరాడితేనే స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకోగలమన్నారు. 
 
సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ పంథాలను పక్కన పెట్టి ఉద్యమంలోకి రావాలని గంటా పిలుపునిచ్చారు. తన స్ఫూర్తితో మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ఆశీస్తున్నాని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
పోరాటాల ద్వారానే స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టుకోగలమన్నారు. స్పీకర్ తన రాజీనామా అమోదిస్తారనుకుంటున్నానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ఎవరైనా నాన్ పొలిటికల్ వ్యక్తిని తన స్థానంలో పోటీ చేయిస్తే బాగుంటుందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 
 
తాను విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసమే రాజీనామా చేశానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు. 
 
అయితే, గంటా రాజీనామా లేఖపై పలు విమర్శలు వచ్చాయి. రాజీనామా చేయాలంటే దానికి ఓ ఫార్మాట్ ఉంటుంది. లేఖలో ఎలాంటి కారణాలు చెప్పకూడదు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ ఒక్క వ్యాక్యం మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. 
 
కానీ గంటా మాత్రం తాను స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విమర్శల నేపథ్యంలో  మరోసారి తన పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఏకవాక్యంతో తన రాజీనామాను గంటా సమర్పించారు.