ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:55 IST)

రాజధానిని ముక్కలు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం!

రాజధాని అమరావతి ప్రజల జీవితాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛిద్రం చేస్తున్నాయ‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.బాబూరావు విమ‌ర్శించారు. రాజధానిని ముక్కలు చేసి ప్రజల జీవితాలతో పాలకులు చెలగాటం ఆడుతున్నార‌ని ఆరోపించారు. 
 
ఇపుడు త్రిశంకు స్వర్గంలో రాజధాని ప్రజలున్నార‌ని, పూలింగ్ చట్టంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింద‌న్నారు. నేటి నుండి సిపిఎం ఆధ్వర్యంలో రాజధానిలో దశల వారీ ఆందోళన చేస్తున్నామ‌ని, నవంబర్ 6న తుళ్లూరులో మహా ధర్నా చేస్తామ‌ని చెప్పారు. విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.బాబూరావు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మాటతప్పింద‌ని, రాజధానిని ముక్కలు చేస్తూ ప్రజల జీవితాలను చిందరవందర చేస్తున్నద‌ని ఆరోపించారు. 
 
కేంద్రంలోని బిజెపి అమరావతి విషయంలో కపటనాటక మాడుతోంద‌ని, రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా బిజెపి నేతలు పూటకొక మాట మాట్లాడుతూ, ప్రజలను మభ్యపరుస్తున్నారు. సిపిఎం మొదటి నుండి రాజధాని అమరావతిలోనే కొనసాగాలని కోరుతోంది. ఆందోళన నిర్వహిస్తోంది. రైతు ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తోంది.  మోడీ రాజధానికి చెంబుడు నీళ్లు పిడికెడు మట్టి ఇచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టార‌ని బాబూరావు ఆరోపించారు. రాజధానికి రైతులు వేలాది ఎకరాలు భూ సమీకరణలో ఇవ్ద‌డంతో వారికి , కూలీలకు ఉపాధి పోయింద‌ని, పూలింగ్ చట్టంలో ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశార‌ని ఆరోపించారు. 
 
రాజధానిలోని భూమిలేని పేదలకు ఇచ్చేపెన్షన్ నెలకు 2,500 నుండి ఐదు వేల రూపాయలకు
పెంచుతామని హామీ ఇచ్చారు కానీ, నయా పైసా పెంచలేద‌ని, పైపెచ్చు గత ఐదు నెలల నుండి 2500 రూపాయలు పెన్షన్ కూడా విడుదల చేయలేద‌న్నారు. దీనితో పేదలు ఒకవైపున పనులు లేక ఆకలితో అలమటిస్తున్నార‌ని, అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ ఇస్తానన్న మాట కాగితాల మీద మిగిలింద‌ని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు నెలకు 18,000 రూపాయలు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా పదివేలతో సరిపెడుతున్నార‌ని, ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయిందని విమర్శించారు. సమావేశంలో బాబురావుతో పాటు రాజధాని అమరావతి కార్యదర్శి ఎం. రవి, నేతలు భాగ్యరాజు, వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.