బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:51 IST)

ఆ దళిత యువతిని చందానగర్‌ లాడ్జిలో కోటిరెడ్డే చంపేశాడా?

ఇటీవల హైదరాబాద్ నగరంలో చందానగర్‌లోని ఓ లాడ్జిలో మృతి చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన యువతి నాగచైతన్య(24)ది హత్యగా పోలీసులు భావిస్తున్నారు. లాడ్జిలో యువతితో ఉన్న కోటిరెడ్డి.. ఆ తర్వాత గదికి తాళం వేసి వెళ్లాడని, అనంతరం తన ఒంటిపై గాయాలు చేసుకుని ఒంగోలు ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కోటిరెడ్డే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. నాగ చైతన్యను కోటిరెడ్డి నమ్మించి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హత్య కేసుగా నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చందానగర్‌ సీఐ క్యాస్ట్రో తెలిపారు.
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె గొర్రెముంచు నాగ చైతన్య (24). నల్లగండ్ల సిటిజన్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్‌ రిప్రజంటెటీవ్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఆస్పత్రికి వెళ్లే క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 
 
యువతి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. సవతి తల్లి మాత్రం ఉంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన ఆసుపత్రి ఎదురు ప్రాంతంలోని ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. మరుసటి రోజు ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పరిశీలించడంతో గొంతుకోసి రక్తపు మడుగులో నాగచైతన్య మృతి చెంది ఉంది.
 
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రేమికుడు కోటిరెడ్డి పొట్ట, గొంతు దగ్గర కత్తి గాట్లతో ఒంగోలు వెళ్లి ఆసుపత్రిలో చేరినట్టు పోలీసులకు సమాచారం అందింది.
 
ఆమె గొంతు కోసుకుందని, భయంతో తాను వచ్చేశానని కోటిరెడ్డి చెప్పినట్లు సమాచారం. లాడ్జి గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలతోపాటు రక్తం మడుగును కడగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగించిన పోలీసులు.. యువతిని కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.