అటవీసంపదను కాపాడుకోవడం కోసమే మొక్కల పెంపకం: మంత్రి బాలినేని
పర్యావరణ పరిరక్షణకు అటవీసంపదను కాపాడడంతో పాటు మొక్కల పెంపకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించిన నేఫధ్యంలో విజయవాడ ఏ1 కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఛైర్మన్ మొండితోక అరుణ్‌కుమార్ చేత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.
కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావులు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా అటవీ సంపద అభివృద్ధితో పాటు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ దాదాపు 50 వేల హెక్టార్లలో యూకలిప్టస్, వెదురు, జీడిమామిడి, కాఫీ, మిరియాలు, టేకు తోటలు పెంచి రాష్ట్ర అటవీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.
అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలకు నాణ్యమైన ముడి సరుకులను, సేవలను అందిస్తూ సంస్థ లాభాలు గడిస్తుందన్నారు. గిరిజనులకు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి జీవనోపాధి కల్పిస్తూ ఈ సంస్థ అటవీ అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు.
అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా 2019లో రూ.89.58 కోట్లు, 2020లో రూ.86.38 కోట్లు, 2021 సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.60.11 కోట్ల అటవీ ఫలసాయాలు ద్వారా ఆదాయాన్ని ఆర్జించిందని మంత్రి చెప్పారు. ఎకో టూరిజంను అభివృద్ధి చేయడానికి ముత్యాలపాలెం దగ్గర సూర్యలంక బీచ్, అనంతగిరి దగ్గర అరకులో ఎకో టూరిజం సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అక్కడ నాచుర్ ఎడ్యుకేషన్ క్యాంపులను నిర్వహణ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో యూకలిప్టస్, వెదురు, టేకు, కాఫీ, మొదలగు అటవీసంపద అభివృద్ధికి సంస్థ ఇతోధికంగా కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భూమిలేని నిరుపేదలకు రిమోట్ ఏరియాలోని ప్రజలకు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేవిధంగా సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదన్నారు.
రాష్ట్రంలో 49731 హెక్టార్లలో అటవీ అభివృద్ధికి సంస్థ ద్వారా ప్లాంటేషన్ చేపట్టామని వాటిలో 327 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.