శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (10:07 IST)

సర్.. మీరు రాష్ట్ర అతిథి కాదు.. భోజన బిల్లు చెల్లించండి.. తమ్మినేనికి అవమానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం దంపతులకు ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. ఆయన ఒక రాష్ట్ర సభాపతిగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బస చేశారు. కానీ, ఏపీ భవన్ సిబ్బంది మాత్రం ఆయన నుంచి భోజనం, వసతి ఖర్చులు ముక్కుపిండి వసూలు చేశారు. సర్.. మీరు స్టేట్ గెస్ట్‌గా కాదు.. కేటగిరీ-1 కింద విడిది ఇచ్చారు. అందువల్ల బిల్లు చెల్లించాల్సిందేనంటూ కోరారు. దీంతో చేసేదేం లేక ఆయన బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, డెహ్రాడూన్‌ నుంచి శనివారం సాయంత్రం తమ్మినేని ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సతీసమేతంగా చేరుకున్నారు. ఆయనకు స్వర్ణముఖి బ్లాకులోని 320 గెస్ట్‌ రూమ్‌ను కేటాయించారు. ఆయన ఆదివారం సాయంత్రం రాష్ట్రానికి వెళ్లే హడావుడిలో ఉండగా.. ఏపీ భవన్‌ చిరుద్యోగి ఒ కరు వచ్చి.. 'సార్‌... భోజన, వసతి బిల్లు కట్టమన్నారు' అంటూ పుస్తకంపై సంతకం చేయాలని కోరారు. 
 
దీంతో రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనను బిల్లు అడగడమేంటని సీతారాం విస్తుపోతూ సిబ్బందిని ప్రశ్నించారు. 'సార్‌.. మీకు కేటగిరీ-1 కింద విడిది ఇచ్చారు. అమరావతిలో ఉండే సాధారణ పరిపాలనా విభాగం(జీఏడీ) నుంచి స్టేట్‌ గెస్ట్‌గా కాకుండా కేటగిరీ-1లో మీకు వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. అందువల్లే ఈ పొరపాటు జరిగింది' అని వారు వివరణ ఇచ్చారు. 
 
దీంతో ఇక చేసేదేం లేక 'ముందు బిల్లు కట్టేయండి.. తర్వాత సంగతి నేను చూసుకుంటా' అని సీతారాం తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. ఆ సమయంలో ఆయన సతీమణి వాణి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. 'డబ్బు ఎంతైనా ముందు ఇచ్చేద్దాం. మనకు అవమానం జరిగింది. స్పీకర్‌గా ఈ అధికారులు గౌరవించలేదు' అంటూ అసహన వ్యక్తం చేసింది.