ప్రాణాలు తీసే బుల్లెట్ శరీరంలో వుండిపోయింది.. రెండేళ్లు ఆ మహిళ?
శరీరంపై చిన్న ముళ్లు గుచ్చుకుంటేనే నొప్పిని భరించలేం. అలాంటిది ప్రాణాలు తీసే బుల్లెట్ శరీరంలో వుండిపోయిన విషయాన్ని ఓ మహిళ గుర్తించలేకపోయింది. ఆ బుల్లెట్ శరీరంలో వుందన్న విషయాన్ని గుర్తించలేక వెన్ను నొప్పితో నానా తంటాలు పడింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వెన్నెముకలో వస్తున్న భరించలేని నొప్పి కారణంగా ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లడంతో ఆమె శరీరంలో బుల్లెట్ వుందని వైద్యులు గుర్తించారు. ఆపై ఆపరేషన్ ద్వారా ఆ బుల్లెట్‌ను వెలికితీశారు. ఈ ఘటన హైదరాబాద్, ఫలక్ నుమా ప్రాంతంలో జరిగింది. 18 ఏళ్ల యువతి ఫలక్ నుమాలో కుట్టుమిషన్ కుట్టుకుంటూ పొట్టపోసుకుంటోంది. మూడు నెలలుగా వెన్నెముకలో నొప్పిగా ఉండటంతో నిమ్స్‌లో చేరింది.
కొన్ని పరీక్షల తర్వాత ఆమె శరీరంలో గాయం ఉందని తేల్చిన వైద్యులు, ఆపరేషన్ చేయగా, బుల్లెట్ బయటపడింది. ఇది కనీసం మూడేళ్ల నుంచి ఆమె శరీరంలో ఉండి ఉండవచ్చని వైద్యులు తేల్చారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి శరీరంలో బుల్లెట్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.