1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 జులై 2024 (22:11 IST)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

Pawan Kalyan Surya Aradhana
ఇతర మతాల్ని గౌరవిద్దాం, మన మతాన్ని, సనాతన ధర్మాన్ని ఆరాధిద్దాం అని బహిరంగంగా చెప్పిన రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. గురువారం నాడు ఆయన సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరించారు. విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన ఆచరిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు.
 
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకరణంగావించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు. వెన్ను సంబంధిత ఇబ్బందితో కొద్ది కాలంగా సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కావడంలేదు. అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్రసహిత ఆరాధనను నిర్వర్తించారు.
 
Pawan Kalyan Surya Aradhana
ఆదివారం సూర్యారాధనతో పనులకు శ్రీకారం, భారతీయ సంస్కృతిలో భాగం 
వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా చేపట్టిన సూర్యారాధన సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ ఈ ఆరాధన విశిష్టతను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. “సమాజ వికాసం, సౌభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేయాలి. మన ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలు. మన పురాణేతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన ఉంది. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారు అని మహా భారతం చెబుతోంది. శ్రీ మహా విష్ణువు సూర్యభగవానుడి నుంచి చక్రాయుధాన్ని పొందాడు. ఆరోగ్యానికి సైతం సూర్యారాధన మేలు చేస్తుంది. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయింది. కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉంది. రవి వారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారు. అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అనవచ్చు” అని వేద పండితులు తెలిపారు.
 
వారాహి దీక్ష, సూర్యారాధనలు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ పూజల గురించి వివరిస్తూ “ఆర్ష ధర్మంపట్ల, సనాతన సంస్కృతిపట్ల అత్యంత గౌరవం, శ్రద్ధ శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి. మహర్షిప్రోక్తమైన మంత్ర విధానంతో పూజాదికాలు నియమనిష్టలతో సాగుతున్నాయి. సకల వర్గాల ప్రజల మేలును ఆయన ఆకాంక్షించారు’’ అని వివరించారు.