గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (11:35 IST)

దేవినేని ఉమామహేశ్వర రావుకి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కు బెయిల్ మంజూరు అయింది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ, ఏపీ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక దేవినేని విడుద‌లే త‌రువాయి.
 
మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం  ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. స్టేషన్ నుంచి రికార్డు రాలేదు కాబట్టి విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. కానీ స్టేషన్ కేవలం 30కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి వెంటనే తెప్పించి విచారణ జరపాలని ఉమా తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరపు న్యాయవాది ఏకీభవించిన న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. ఈరోజు జరిగిన వాద‌న‌ల్లో ఉమ‌కు బెయిల్ మంజూరు అయింది.
 
కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న సమాచారంతో దేవినేని ఉమ పరిశీలను వెళ్ల్ళారు. ఈ క్రమంలోనే జి. కొండూరులో అలజడి చెలరేగింది. దీనంతటికి మాజీ మంత్రే కారణమంటూ ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌త బుధ‌వారం కోర్టు దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్ విధించ‌గా, రాజమండ్రి జైలుకు తరలించారు.

తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమ ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై అన్యాయంగా హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఉమ పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. స‌రిగ్గా వారానికి ఉమ‌కు బెయిల్ మంజూర‌యింది.