అనంత ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప... అంతా డ్యూటీ మైండెడ్ అప్ప!
నిరంతర పోలీసింగ్ ఆయన డ్యూటీ, పనిలో ఛండ శాసనుడు, ఏం చేసినా తిరుగుండదు. పోలీస్ అంటే, లా అండ్ ఆర్డర్, క్రైం... దొంగలు, హత్య కేసులు ఇవే కాదు... వాటికి దారి తీసే మోసాలను అరికట్టడం కూడా పోలీస్ డ్యూటీనే అని భావిస్తారు అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప.
అందుకే ఆయన విత్తనాలు, ఎరువుల షాపులపైనా తనిఖీలు మొదలుపెట్టారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ దుకాణాలలో దాడులు నిర్వహించారు. దీనికి పోలీసులు వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నారు.
నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో విత్తన దుకాణాలు, ఎరువుల దుకాణాల్లో నిల్వల రికార్డులు, విక్రయ నమోదు పట్టికలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యత కల్గిన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
గడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమతి లేకుండా ఎరువులు విత్తనాల దుకాణాలు నడిపినట్టయితే, తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నాసిరకం ఎరువులు విత్తనాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.