గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (09:40 IST)

భార్యా కుమార్తెపై పోలీసులు చర్యలు తీసుకోవాలి : కోర్టులో దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్

duvvada srinivas
తన భార్య దువ్వాడ వాణి, కుమార్తె దువ్వాడ హైందవిలు తన ఇంటిపైకి వచ్చి దాడి చేస్తున్నారని, వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ హట్ టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. ఇపుడు ఈ పంచాయతీ హైకోర్టుకు చేరింది. ఓ పక్క శ్రీనివాస్ భార్య వాణి న్యాయపోరాట దీక్ష కొనసాగిస్తుండగా, శ్రీనివాస్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 
 
భార్య వాణి, కుమార్తె హైందవి ఇంటిపైకి వచ్చి వివాదం చేస్తున్నారని, వారిపై నమోదు చేసిన కేసులో టెక్కలి పోలీసులు దర్యాప్తు చేయడం లేదని కోర్టుకు విన్నవిస్తూ.. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ కోరాడు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. 
 
ఈ కేసులో ముందుగా పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఐదు రోజుల క్రితమే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితులు వాణి, హైందవిలకు సెక్షన్ 41(ఏ) నోటీసులు ఇచ్చి విచారణ కోరారని చెప్పారు. మరో పక్క దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన అర్థాంగి వాణి సైతం ఫిర్యాదు చేశారని, పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.