మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (08:30 IST)

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూకంపం.. 3 నిమిషాల వ్యవధిలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూమి కంపించింది. కేవలం 3 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు కనిపించాయి. దీంతో స్థానికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం భయంతో ఇళ్లకు బీటలు వారాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. వంటిట్లోని అనేక సామానులు కిందపడిపోయాయి. 
 
ముందు వచ్చిన ప్రకంపనలు ఆగిపోయాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో చివరిగా రాత్రి ఒంటి గంట తర్వాత మరోమారు భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు. 
 
ఈ భూప్రకంపనలు ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, వీకేపేట, దాసన్నపేట, దానంపేట తదితర ప్రాంతాల్లో కంపించిందని స్థానిక తాహశీల్దారు శ్రీహరిబాబు వెల్లడించారు. కవిటి మండలంలో దాదాపు పది గ్రామాల్లో భూప్రకంపనలు కనిపించాయని ఆయా గ్రామాల ప్రజలు వెల్లడించారు.