గురువారం, 17 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 జులై 2025 (15:15 IST)

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

woman victim
గత వైకాపా ప్రభుత్వంలో కొందరు వైకాపా నేతలు అధికారమదంతో ఓ మహిళకు శిరోమండనం చేయించారు. ఆమెకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి యేడాది గడిచిపోయినా ఆమెకు ఫలితం మాత్రం శూన్యం. దీంత తన బిడ్డతో కలిసి ఆమె రోదిస్తోంది. 
 
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన బాధితురాలు తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె పేరు షేక్ ఆషా (27). ఆమెది నెల్లూరు. భర్త పేరు కర్రి రాంబాబు ఎలియస్ అభిరామ్. అతడిది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడి. హైదరాబాద్ నగరంలో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసే క్రమంలో 2018లో ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె చిన్న చిన్న ఈవెంట్లు చేసేది. కుమారుడు పుట్టిన తర్వాత భర్త ముఖం చాటేశాడు. 
 
బిడ్డను తీసుకుని పెదకొండేపూడిలోని అత్తమామల వద్దకు వెళ్లగా, వారు బయటకు గెంటేశారు. ఆమె పోలీస్ స్టేషనులో కేసు పెట్టగా దానిని ఉపసంహరించుకోవాలంటూ వైకాపా నాయకులు బెదిరించారు. వైకాపా అప్పటి ఎమ్మెల్యే, ఆయన తల్లి సైతం ఫోన్లు చేసి హెచ్చరించారు. ఓ విద్యాధికుడు ఆమెకు అండగా నిలవగా ఆయనను తీవ్రంగా అవమానించి బెదిరించారు. 
 
2024 ఫిబ్రవరిలో రాంబాబు రెండో పెళ్లి చేసుకోబోతుండగా ఆషా అడ్డుకోవడంతో భర్త రాంబాబు ఆమెను ఇంట్లో బంధించి శిరోముండనం చేశాడు. ఆ జుత్తు ఒక చేత్తో పట్టుకుని ఆమెను మరో చేత్తో బయటకు ఈడ్చుకు వచ్చి వీధంతా తిప్పాడు. దీనిపై కేసు నమోదై ఛార్జిషీట్ కూడా దాఖలైంది. కానీ ఇప్పటికీ అతనిపై చర్యలు తీసుకోలేదు. పైగా, ఆ మహిళకు న్యాయం జరగలేదు.