శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (08:07 IST)

గుడ్డు సంపూర్ణ పోషకాహారం.. మంత్రి సురేష్

గుడ్డు సంపూర్ణ పోషకాహారమని, బలమైన ఆహారం కావటంతో ఆరోగ్యం కోసం అవసరమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్బంగా ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఎనికేపాడులోని బి.వి.రావు కల్యాణమండపంలో శుక్ర‌వారం సభ జరిగింది. సభకు పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రైతు సాధికార కమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి హాజరయ్యారు.

సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి విద్యాశాఖ కు నిధుల కేటాయింపు లో ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. ముఖ్యంగా గుడ్డు కోసం విద్యాశాఖలో కూడా దాదాపు రూ.250 కోట్లు కేటాయించటం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రొక్యూర్మెంట్ ద్వారా జిల్లాల వారీగా కేటాయింపులు చేస్తామని చెప్పారు. ధరలు, నాణ్యత దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు లోబడి సరఫరా చేసే వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

రవాణా ఖర్చు, నాణ్యతను బట్టి ధరలు ఉండేలా చూస్తామన్నారు. ప్రభుత్వ నిధులే కదా అనే చులకన భావం లేకుండా పిల్లల ఆరోగ్యం కోసం వ్యాపారులు పని చేయాలన్నారు. వ్యాపారులు కూడా సొంత లాభం కొంత మానుకుని పిల్లల ఆరోగ్యం కోసం నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రాబోయే రోజుల్లో గుడ్డుకున్న ప్రాధాన్యత పెరుగుతుందని దానివల్ల పౌల్ట్రీ యజమానులకు లాభసాటి గా కూడా ఈ వ్యాపారం మారబోతుందని అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో ఎంత మంచి భోజనం పెట్టినా గుడ్డు లేని భోజనాన్ని పిల్లలు ప్రశ్నించే స్థాయికి గుడ్డు ప్రాధాన్యత ఉందన్నారు.

ప్రభుత్వ పరంగా పౌల్ట్రీ యజమానులకు పాత బకాయిలు రావలసి ఉన్నట్లయితే ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పౌల్ట్రీ రైతులతో అతిధులను సత్క‌రించారు.
 
విద్యాశాఖ లక్ష్య సాధనకు కృషి చేయండి
రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి, సంస్కరణలు, తదితర విషయాల్లో ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రణాళికతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో అధికారులతో శుక్ర‌వారం ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి జగన్మోహ‌న్‌రెడ్డి విద్యాశాఖ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని అన్నారు. మనబడి కార్యక్రమం లో భాగంగా నాడు - నేడు ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. విద్యా నవరత్నాలు అమలుకు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, కొత్తగా కావలసిన ప్రతిపాదనలు, మరమ్మతులు పై చర్చించారు.

మరుగుదొడ్ల‌లో నీటి వసతులు, పాఠశాలల్లో విద్యుద్దీకరణ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పాఠశాల ప్రహారీలకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన పేరెంట్స్ కమిటీ ల విధి విధానాలు వారికి తెలిపి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. పాఠశాలల అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని అన్నారు.

సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, కమిషనర్ సంధ్యారాణి, బాలకృష్ణన్, నాగరాజు, ప్రతాపరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.