గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (08:01 IST)

ఫిర్యాదుల పరిష్కారంలో ప్రామాణిక ఆపరేటివ్ విధానం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ప‌్ర‌జా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన ఫిర్యాదులను పరిష్కరించేందుకు అన్ని శాఖలు ప్రామాణిక ఆపరేటివ్ విధానాన్ని పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.

అమరావతి సచివాలయంలోని 5వ భవనంలో సిఎస్ అధ్యక్షతన స్పందన సొల్యూషన్స్ పై వర్క్ షాపు జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో శాఖల వారీగా అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ పై సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు.

ప్రభుత్వ శాఖలు,ప్రజలు అనగా ఫిర్యాదుదారుల మధ్య పరస్పర విశ్వాసం పెరిగితేనే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందని అన్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ఒక నిర్దిష్ట కాలవ్యవధి పెట్టి ఆ గడువులోగా ఆ ఫిర్యాదును పరిష్కరించడంతో పాటు ఆ సమాచారాన్ని ఫిర్యాదు దారునికి తెలియజేయాలని ఆదేశించారు.

స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాల షెడ్యూల్ ను సిద్ధం చేసి ఆవివరాలను ప్రణాళికాశాఖకు అందించాలని చెప్పారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారానికి శాఖల వారీగా రూపొందించిన టైమ్ లైన్ మరియు స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ వివరాలను కూడా ప్రణాళికాశాఖకు అందించాలని ఆదేశించారు.

స్పందన ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును సకాలంలో సక్రమంగా పరిష్కరించాలని ఈ విషయంలో అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. అలాగే స్పందన ఫిర్యాదుల పరిష్కారానికి వివిధ శాఖలు అనుసరించే ప్రామాణిక ఆపరేటివ్ విధానం(స్టాండర్డ్ ఆపరేటివ్ విధానం)ఒకేరీతిలో ఉండేలా చూడాలని, క్వాలిటీ రిడ్రస్సల్ ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు.

ప్రతి ఫిర్యాదు ఆమోదానికి ముందు లబ్దిదారు ఎంపిక అనంతరం సోషల్ ఆడిట్ తప్పనిసరని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతోపాటు విద్యావంతులైన యువత ఉద్యోగ విధుల్లో చేరినందున సంబంధిత శాఖలు గ్రామ, వార్డు సచివాలయాలతో పూర్తిగా ఇంటిగ్రేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.

విభిన్న ప్రతిభా వంతులకు వారి అంగవైకల్యం నిర్ధారిస్తూ జారీ చేసే సథరమ్ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ స్పష్టం చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మరిన్ని సథరమ్ సర్టిఫికెట్ జారీ కేంద్రాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

సథరమ్ సర్టిఫికెట్ పొందాలంటే పాస్పోర్ట్ పొందినంత ఇబ్బందులు పడడానికి వీలులేదని ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేగాక సథరమ్ సర్టిఫికెట్లు జారీలో విభిన్న ప్రతిభావంతుల విభాగానికి కూడా భాగస్వామ్యం ఉండాలని చెప్పారు.

గృహ నిర్మాణం చేపట్టే ముందు సంబంధిత లబ్ధిదారుల పేర్లను గ్రామ లేదా వార్డు సచివాలయంలో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించిన తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సిఎస్ ఆదేశించారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి స్పందన ఫిర్యాదుల పరిష్కారానికి అనుసరించే ప్రామాణిక ఆపరేటివ్ విధానం, టైమ్ లైన్ తదితర అంశాలను వివరాలను.

సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మన్మోహన్ సింగ్, పూనం మాల కొండయ్య, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్, లోకేశ్వర్, హరికృష్ణ, ముఖ్య కార్యదర్శులు కె.దమయంతి, బి.రాజశేఖర్, అజయ్ జైన్, సియం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.