శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై సిఎస్ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం(ఫిర్యాదుల పరిష్కారం) కింద ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల సత్వర హేతుబద్ధమైన పరిష్కారానికి పటిష్టమైన స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్(ఎస్ఓపి)విధానాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.

గురువారం అమరావతి సచివాలయంలో స్పందన కార్యక్రమం ఫిర్యాదుల పరిష్కారానికి చేపట్టాల్సిన స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. స్పందన కార్యక్రమంపై స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ పై అన్ని శాఖల కార్యదర్శులు కూలంకషంగా చర్చించి అమలులోకి తెచ్చేందుకు ఈనెల 9వ తేదీన ఉ.10గం.లకు సచివాలయం 5వ బ్లాకు మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మరొకసారి కార్యశాల(వర్కుషాపు)ను నిర్వహించడం జరుగుతుందని సిఎస్ తెలిపారు.

ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు, ఆయా శాఖాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈలోగా సంబంధిత శాఖలు  వారివారి శాఖలకు సంబంధించి స్పందన ఫిర్యాదుల పరిష్కారానికి చేపట్టాల్సిన స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్స్ పై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఆర్టీజీ సిఇఓ బాలసుబ్రహ్మణ్యం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.