సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (08:24 IST)

ఇంటి నుంచే స్పందన.. ప్రత్యేక వెబ్‌సైట్, టోల్‌ ఫ్రీ నంబర్‌ : 1800–425–4440

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేస్తోంది. పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడంతో వారం వారం ఈ కార్యక్రమానికి వెల్లువెత్తుతున్నారు.  అర్జీలు చేతబట్టి సోమవారం వేలాదిగా తరలివస్తున్నారు. అధికారులు వారి వినతులు స్వీకరించి ఎప్పటిలోగా పరిష్కరించేదీ ఒక రశీదు కూడా ఇస్తున్నారు. ఇది ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తోంది. 
 
దీనిపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఒక్క సోమవారమే కాకుండా ఎప్పుడైనా ఇంటి నుంచే నేరుగా ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
 
ఈ వెబ్‌సైట్‌ ముఖ్య ఉద్దేశం.. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు, అధికారుల చెంతకు వెళ్లి అర్జీలు ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది. ప్రతి సోమవారం ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. 
 
మండల, జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లి అర్జీలు ఇవ్వాలంటే  ప్రజలు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. అర్జీ ఇవ్వడానికి కొంత కష్టపడక తప్పడం లేదు. ఇలాంటి వారి ఇబ్బందులు తొలగించేలా ఆన్‌లైన్‌లో అర్జీ సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వారంలో అన్నిరోజుల్లోనూ వినతులను ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. 
 
ఇందుకు సంబంధించి సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఉంచింది. జిల్లా, మండల, గ్రామాల వారీగా వివరాలు పేర్కొని సమస్యను నివేదించేలా పోర్టల్‌ను తీర్చిదిద్దారు. ఆన్‌లైన్‌లో అర్జీలు నమోదు చేసుకోవడం చాలా సులభం. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అర్జీలను నమోదుచేసుకోవడం సులభం. సమాచారం తెలుగులోనూ ఉంటుంది. 
 
స్పందన.ఏపి.జీఓవి.ఇన్‌ టైప్‌ చేస్తే స్పందన పోర్టల్‌ తెరుచుకుంటుంది. దీని గురించి క్షుణంగా తెలుసుకోవాలంటే వాడుక సూచికపై క్లిక్‌ చేయాలి. ఇందులో 50 పేజీలు ఉన్న పీడీఎఫ్‌ ఫైల్‌ తెరుచుకుంటుంది. ఇందులో ప్రతి అంశాన్ని పొందుపరిచారు.
 
ఇలా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేయాలంటే ఆన్‌లైన్‌ యూజర్‌ లాగిన్‌పై క్లిక్‌ చేయాలి. ప్రత్యేకంగా ఒక పేజి తెరపై కనిపిస్తుంది. ఆన్‌లైన్‌ సిటిజన్‌ లాగిన్‌ను క్లిక్‌ చేయాలి. ఆధార్‌ సంఖ్య నమోదు చేయమని అడుగుతుంది. తరువాత ఆధార్‌తో అనుసంధానమైన చరవాణికి ఓటీపీ సంఖ్య వస్తుంది. దీనిని నమోదు చేయాలి. తక్షణం స్పందన అర్జీ పేజీ తెరుచుకుంటుంది. ఇందులో మూడు సూచికలు పొందుపరిచారు. 
 
మొదటిది యూజర్‌ ఇన్‌బాక్స్, రెండోది అర్జీ నమోదు, మూడోది అర్జీ నకలు జతచేయడం. యూజర్‌ ఇన్‌బాక్స్‌ను క్లిక్‌ చేస్తే గతంలో ఆధార్‌ సంఖ్యతో అనుసందానమై అర్జీలు ఆన్‌లైన్‌లో నమోదుచేసి ఉంటే వివరాలు కనిపిస్తాయి. వాటి ప్రగతి తెలుసుకోవచ్చు. రెండో సూచిక అర్జీ నమోదుపై క్లిక్‌చేస్తే స్పందన దరఖాస్తు తెరపై కనిపిస్తుంది.             
 
ఇందులో ఫిర్యాదు చేయాల్సిన ప్రభుత్వ విభాగాన్ని ఎంచుకుని అంశాల వారీగా వివరాలు నమోదు చేయాలి. ఇదే పేజీలో దిగువన టైప్‌ అన్న చోట ఆన్‌లైన్‌ యూజర్‌ అనే ఆప్షన్‌ ఎంచుకున్నాక ప్రభుత్వ శాఖల వివరాలు ఎంపిక చేసుకుని దరఖాస్తు అంశాలు నింపే వీలుంటుంది. రిపోర్టులు, ఇతర స్కాన్‌ ఫైళ్లు కూడా పంపేందుకు అర్జీ నకలు జతచేయండి అనే అంశంపై క్లిక్‌చేసి అప్‌లోడ్‌ చేసేలా తీర్చిదిద్దారు.