శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 18 జులై 2018 (18:47 IST)

బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టయినా ప్రత్యేక హోదా సాధిస్తాం

అమరావతి : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తెలిపారు. అవిశ్వాసం నుంచి కేంద్రాన్ని గట్టెక్కించడానికి వైఎస్ఆర్‌సిపి ఎంపీలు రాజీనామా చేశారని విమర్శించారు.

అమరావతి : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తెలిపారు. అవిశ్వాసం నుంచి కేంద్రాన్ని గట్టెక్కించడానికి వైఎస్ఆర్‌సిపి ఎంపీలు రాజీనామా చేశారని విమర్శించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆనాడు అన్ని పార్టీలూ విభజన చేశాయన్నారు. నేడు అవే పార్టీలకు ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నో పార్టీలు టీడీపీ ఎంపీలిచ్చిన అవిశ్వాసం నోటీసుకు దన్నుగా నిలిచారన్నారు. 
 
అవిశ్వాసం పెట్టినా, పెట్టకపోయినా తమకేమీ అభ్యంతరం లేదని వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పడం దుర్మార్గమన్నారు. వైసీపీకి రాష్ట్రాభివృద్ధి ఎంతటి చిత్తశుద్ధి ఉందో వెల్లడవుతుందన్నారు. లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక నేటికీ వైఎస్ఆర్ సిపి విప్ సభ్యురాలిగా పార్లమెంట్ రికార్డులో ఉన్నారన్నారు. తమ పార్టీ సభ్యులు రాజీనామా చేసినప్పుడు, బుట్టా రేణుకను విప్‌గా తొలగించాలని స్పీకర్‌కు వైఎస్ఆర్ సిపి లేఖ రాయాలన్నారు. అయితే, ఆ పార్టీ పట్టించుకోకపోవంతో, వైసీపీ విప్‌గా బుట్టా రేణుకను స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారన్నారు. 
 
పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి రోడ్ల మీద తిరిగే వైసీపీ నేతలకు రాజ్యాంగంపై ఏం అవగాహన ఉంటుందని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ తంతారన్న భయంతోనే రోడ్లమీద తిరుగుతున్నారన్నారు. తమ కేసుల మాఫీ కోసం బీజేపీ అంటకాగుతున్నారన్నారు. గత సమావేశాల మాదిరిగానే టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై గట్టి పోరాటం చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం నోటీసిచ్చిరన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వైఖరేంటో తెలపాలని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. 
 
బీజేపీతో లాలూచిపడిన వైసీపీ నేతలకు ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హతలేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన నరేంద్ర మోదీని కాదని పదేపదే సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు సరికాదన్నారు. చంద్రబాబు ప్రధానమంత్రి కాదని, ఆయన ముఖ్యమంత్రి అనే విషయం వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీకి మేలు కలుగజేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ లోక్ సభ సభ్యులు రాజీనామా చేశారన్నారు. అవిశ్వాసం సందర్భంగా ఓటింగ్‌కు దూరమైనా, బీజేపీకి మేలు చేసినట్లేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ వెల్లడించారు. 
 
తమ కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, నరేంద్రమోదీకి వంతపాడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడును కాల్చేస్తాం, బంగాళాఖాతంలో పడేస్తామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. వయస్సుకైనా గౌరవం ఇవ్వాలన్న ఇంగితజ్ఞానం కూడా వైకాపా నేతలకు లేదన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీని జీరో చేయాలని 5 కోట్ల ఆంధ్రులు భావిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు తమ కేసుల మాఫీ కోసం జీరోల వెంటపడుతున్నారన్నారు. అవిశ్వాసం పెడతామంటూ బీరాలు పలికిన మగాళ్లు వీళ్లేనా... అని ప్రశ్నించారు. గల్లీలో మాట్లాడే వైసీపీ నాయకులకు ఢిల్లీలో నోరెత్తే దమ్ముందా అని సవాల్ విసిరారు. మతోన్మాదంతో విర్రవీగుతూ, మైనార్టీలపైనా, దళితులపైనా బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు. చర్చిలు తగుల బెడుతున్నారన్నారు. అటువంటి హిందూత్వ పార్టీతో వైఎస్ఆర్ సిపి లాలూచీపడుతోందన్నారు. 
 
హిట్లర్‌ను తలదన్నెలా వ్యవహరిస్తున్న నరేంద్రమోదీకి ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అవిశ్వాసం ద్వారా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుంటామని చైర్మన్ జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రపంచమంత తిరిగి అవిశ్వాసానికి మద్దతు తెస్తానన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు పట్టించుకోవడం మానేశారన్నారు. దమ్ముంటే తమ బండారాన్ని పార్లమెంట్‌లో బయటపెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావుకు ఆయన సవాల్ విసిరారు. తెలుగోడై ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలను ఆయన పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అండగా ఉండాల్సింది పోయి, సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటూ వస్తోందన్నారు.