శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 మార్చి 2021 (17:19 IST)

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలి: గవర్నర్

ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతీ పౌరుడూ వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగం పరంగా ఎటువంటి ఆశ్రద్ద కూడదన్నారు. స్థానిక సంస్థలు, నగర పాలక సంస్ధలు, సాధారణ ఎన్నికలు ఇలా ఏవైనప్పటికీ అన్ని సందర్భాలలోనూ ఓటును వినియోగించుకోవడం మన బాధ్యతగా భావించాలన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బుధవారం జరిగిన విజయవాడ నగర పాలక సంస్ధ ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ పేట నగర న్యాయ స్దానముల ప్రాంగణానికి ఎదురుగా ఉన్న చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ నగర పాలక ఉన్నత పాఠశాల (సివిఆర్ జిఎంసి హైస్కూల్)లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ లో ఉదయం వీరిరువురు ఓటు వేసారు. రాష్ట్ర ప్రధమ పౌరుని రాక నేపధ్యంలో విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. .
 
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
మహా శివరాత్రి శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. కోట్లాదిమంది శివ భక్తులకు మహా శివరాత్రి పర్వదినం అత్యంత పవిత్రమైన రోజన్నారు. 
 
మహాశివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకోవటం సాంప్రదాయంగా వస్తుందని, జాగారం ఉండటం ద్వారా ముక్తి సాధించ వచ్చని విశ్వసిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని, ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం ప్రేరేపించాలని గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.