1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (11:25 IST)

నా వంశం నిర్వంశమైంది.. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ఉండదు: రాజయ్య

రాజయ్య కోడలు, మనుమలు ఆత్మహత్య చేసుకున్న కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆయన సతీమణి మాధవి, కొడుకు అనిల్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో వారందరికీ షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయమూర్తి మంజూరు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉండి 90 రోజులు గడిచినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భార్య, కుమారుడు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. రూ. 25 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటలలోపు సుబేదారి పోలీసుస్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఉత్తర్వులను జారీచేసింది. 
 
అంతేకాదు ఈ నెల 15లోపు  ముగ్గురు నిందితులకు ఎలాంటి పాస్ పోర్టులు ఉన్నా కోర్టుకు అందజేయాలని షరతు విధించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బంధువులు మీడియాతో మాట్లాడనివ్వకుండా తీసుకెళ్లే యత్నం చేశారు. కానీ రాజయ్య ధైర్యంగా తాను తప్పు చేయలేదు కదా అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. కోడలు, మనవలు మృతిచెందడంతో తన వంశం నిర్వంశమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ జీవితానికి రిటైర్మెంటు ఉండదని, ప్రజా జీవితంలోనే ప్రజలతోనే ఉంటానని ఆయన అన్నారు.