శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (10:10 IST)

నాకు ముందస్తు బెయిలిస్తేనే అజ్ఞాతం వీడుతా : రవి ప్రకాష్

సంతకాల ఫోర్జరీ, టీవీ9 లోగో అక్రమ విక్రయం, డేటా చౌర్యం తదితర అభియోగాలను ఎదుర్కొంటున్న టీవీ 9 కంపెనీ మాజీ సీఈవో రవి ప్రకాష్ మరోమారు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును హైకోర్టు కొట్టివేసింది. కానీ, ఆయన మాత్రం పట్టువీడకుండా మరోమారు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
అదేసమయంలో పోలీసులకు చిక్కకుండా రవి ప్రకాష్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీవీ 9 కార్యాలయంలో సోదాలు జరిగిన మే 9 నుంచి రవిప్రకాశ్‌ దాదాపు 30 సిమ్‌కార్డులు మార్చినట్లు గుర్తించారు. సాంకేతికంగా పోలీసులు అతడి జాడ కొనుక్కోకూడదనే ఉద్దేశంతో వైఫై ద్వారా వాట్సాప్‌ కాల్స్‌లో మాత్రమే మాట్లాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. 
 
ఫోర్జరీ, డేటా చౌర్యం వంటి అభియోగాలపై సైబరాబాద్‌ పోలీసులు రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ 160, 41 సెక్షన్ల కింద పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఆయన స్పందించలేదు. దీంతో ఆయన అరెస్టు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
కాగా.. రవిప్రకాశ్‌ తనపై నమోదు చేసిన మూడు క్రిమినల్‌ కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తాను పోలీసు దర్యాప్తునకు సహకరిస్తానని.. తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.