మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (12:13 IST)

ఏ క్షణమైనా రవిప్రకాష్ అరెస్టు... లుకౌట్ నోటీసు జారీ

సంతకాల ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవోను ఏక్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. పైగా, గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలదాచుకునివున్నట్టు తెలుస్తోంది. 
 
సంతకాల ఫోర్జరీపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదుచేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారని సమాచారం. ఈ కేసులో బుధవారం సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట రవిప్రకాశ్ హాజరుకావాల్సి ఉంది. ఫిర్యాదుదారుడు అందించిన ఆధారాలను వాటితో సరిపోల్చడంతోపాటు.. రవిప్రకాశ్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టాలనే అంశాలపై ఇప్పటికే సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రశ్నావళిని సిద్ధంచేసుకున్నారని తెలుస్తున్నది. విచారణలో ఆయన వెల్లడించే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 
 
రవిప్రకాశ్ ఫోర్జరీ చేశాడని చెప్తున్న సంతకంతోపాటు ఫోర్జరీకి గురైన వ్యక్తి అసలు సంతకాన్ని పోలీసులు ఇదివరకే సేకరించారు. ఆ రెండింటినీ పోల్చటంతోపాటు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, ప్రాథమిక నివేదిక కూడా తెప్పించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటే పోలీసులకు దొరుకడం ఖాయమని రవిప్రకాశ్ భావించి, ఏపీకి వెళ్లిపోయారని చెప్తున్నారు.  
 
మరోవైపు, రవిప్రకాశ్‌తోపాటు సినీనటుడు శివాజీకి సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సైబరాబాద్ పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. వీటికి ఇద్దరూ స్పందించలేదు. దీంతో సోమవారం రాత్రి మరోసారి సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేశారు. తాజా నోటీసుల ప్రకారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. అప్పటికీ విచారణకు రాకుంటే అరెస్టు చేసేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు.