నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని ఎక్సైజ్ శాఖ అధికారులు బహిర్గతం చేశారు. భారీ స్థాయిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నప్పటికీ పసిగట్టలేదని పేర్కొంటూ ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై బదిలీవేటు పడింది. విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ములకల చెరువు ఇన్‌చార్జ్ బాధ్యతలను లక్కిరెడ్డి పల్లె ఎక్సైజ్ సీఐ కిశోర్ కుమార్‌కు అప్పగించారు.
ములకలచెరువు - మదనపల్లె పాత రోడ్డులోని కనుగొండ ఆర్చి సమీపంలో ఉన్న ఓ పాత డాబాను అవాసంగా మార్చుకుని విజయవాడకు చెందిన జనార్దన్ రావు, ఆయన అనుచరుడు రాజు తమిళనాడు, ఒడిశా, విశాఖపట్నంలకు చెందిన పలువురితో తయారు చేయించి బెల్ట్‌షాపులకు సరఫరా చేశారు. ఈ విషయం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దాడులు నిర్వహించాలని కడప ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వేంపల్లి చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు.
దీంతో ఆయన రాయచోట¨ ఈఎస్ మధుసూదన్, సిబ్బందితో దాడులు చేసి రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యంతో పాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో 15 వేల ఖాళీ సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్, సరఫరాకు ఉంచిన 1,500 లీటర్ల నకిలీ మద్యం బాటిళ్లు, ఇతర సామగ్రి, మద్యాన్ని సరఫరా చేసే వాహనాన్ని సీజ్ చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.