ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి మృతి
ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి (70) సోమవారం రాత్రి మృతి చెందారు. హైదరాబాదు నుంచి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి కాంచీపురం వరదరాజస్వామి దర్శనార్థం వెళ్లిన ఆమె సోమవారం రాత్రి తమిళనాడులోని అరక్కోణం స్టేషన్ నుంచి ఎగ్మోర్ ఎక్స్‌ప్రె్‌సలో తిరుగు ప్రయాణమయ్యారు.
రైలు రేణిగుంటకు చేరుతుండగా భోంచేస్తూ ఆమె రైల్లోనే కుప్పకూలిపోయారు. రేణిగుంటలో పరీక్షించిన రైల్వే డాక్టర్లు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుని రాత్రి పది గంటలకు రేణిగుంట నుంచి హైదరాబాదుకు కేబీ లక్ష్మి మృతదేహాన్ని తీసుకువెళ్లారు.
ఆమెకు ఓ కుమారుడు (ప్రవీణ్), కుమార్తె (సమీర) ఉన్నారు. కేబీ లక్ష్మిగా చిరపరిచితమైన కొల్లూరు భాగ్యలక్ష్మి దాదాపు అర్థశతాబ్దం పాటు సాహితీ వ్యవసాయం చేశారు. విపుల-చతుర పత్రికల్లో మూడు దశాబ్దాల పాటు ఆమె పనిచేశారు. చలసాని ప్రసాదరావు నిష్క్రమణ తరువాత ఆమే సంపాదకత్వం కూడా వహించారు. వేల కొద్దీ కథలను ఎడిట్ చేశారు.