శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జులై 2019 (19:20 IST)

ఆ పోర్టు తెలంగాణకు అప్పగించేందుకు జగన్ ప్రయత్నాలు : చంద్రబాబు సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు.

బందరు పోర్టు ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైందని స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మచిలీపట్నం డీప్‌ వాటర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. 
 
మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థను 2017 మార్చిలో ఏర్పాటు చేసినట్లు తెలిపిన చంద్రబాబు ఈ ఏడాది జూన్‌ 28న RT -62 జీవోను రహస్య జీవోగా జారీ చేసి, రెండు రోజుల్లోనే జారీ చేయలేదని మాట మార్చడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని వైసీపీని నిలదీశారు. 
 
బందరుపోర్టును తెలంగాణకు ఇస్తున్నారా అన్న అంశంపై అసెంబ్లీలో నిలదీస్తే లేదని వైసీపీ బుకాయించిందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు పర్టులు ప్రకృతి ఇచ్చిన వరాలు అంటూ అభిప్రాయపడ్డారు.  
 
పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే తెలుగుదేశం పార్టీ సహించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. 
 
మరోవైపు ఇదే అంశానికి సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అంటూ చెలరేగిపోయారు. 
 
అసమర్థులు ఒక్క ఛాన్స్ అంటూ ఎందుకు అడిగారు దోచుకోవడానికా లేక ప్రజల భవిష్యత్‌ను పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతుల్లో పెడతారా అంటూ లోకేష్ ధ్వజమెత్తారు.