మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జులై 2019 (19:25 IST)

కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా?.. జ్యోతుల నెహ్రూకి విజయసాయి పంచ్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. కాపులకు అన్యాయం చేశారంటూ ప్రతిపక్ష నేతలు అధికార వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా... అసలు అన్యాయం చేసింది తాము కాదని... అదంతా టీడీపీ చలవేనంటూ అధికార పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. 
 
కాగా తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాపులకు ద్రోహం చేసింది ఎవరో మీ అంతరాత్మనే అడగండి అంటూ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూని విజయసాయి ప్రశ్నించారు. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తం కాదా అని ప్రశ్నించారు. అసాధ్యమనీ తెలిసీ 5శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే... చంద్రబాబుని పొగిడింది మీరు కదా అని అన్నారు. ఇప్పుడు ఎవరు ఉసిగొలిపితే... జ్యోతుల ఇలా విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసునని విజయసాయి పేర్కొన్నారు.
 
మరో ట్వీట్ లో చంద్రబాబుపై మండిపడ్డారు. రోమ్ తగలపడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని చంద్రబాబు మరిపించారని ఎద్దేవా చేశారు. నీటి కొరత, రోగాలు, కరువు, తుఫాన్లతో ఇక్కడ ప్రజలు విలవిల్లాడుతుంటే దావోస్ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా తగిలేశారని మండిపడ్డారు. ఈ దావోస్ సదస్సుల వల్ల ఒరిగింది ఏమీ లేదని... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పారు.
 
ఇదిలా ఉండగా... కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ పై జ్యోతుల విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి కాపులు కూడా కారణమని.. కానీ జగన్ మాత్రం కాపు సామాజిక వర్గంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.
 
కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపుకు వర్తింపజేస్తూ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన తీర్మానాన్ని నెహ్రూ గుర్తు చేశారు.కానీ జగన్ మాత్రం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యపడదని కసి తీర్చుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు.  టీడీపీ కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ అమలు జరిగేలా వైసీపీ ప్రభుత్వం.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నెహ్రూ డిమాండ్ చేశారు.
 
తనకు నాయకత్వం ముఖ్యం కాదని.. కాపులకు న్యాయం చేయడమే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలు, పెద్దలతో కలిసి 5 శాతం రిజర్వేషన్‌ సాధనపై చర్చిస్తామని జ్యోతుల తెలిపారు.జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని నెహ్రూ వెల్లడించారు. గోదావరి నీటిని తెలంగాణకు తరలించి.. జగన్, కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారని నెహ్రూ ఆరోపించారు.