ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (20:26 IST)

రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు రెడీ

రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి వివరించారు.
 
రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్లాంటేషన్, వంటి పలు అంశాలపై సోమవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి  జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు వైయస్సార్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఇందుకై  గ్రామ, మండల,జిల్లా స్థాయిలో టీములను ఏర్పాటు చేసుకుని పనులు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం పూర్తి అయిందని, మిగిలిన వాటి నిర్మాణాలు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి  సిద్ధం చేస్తున్నామని వివరించారు.

గ్రామ, మండల స్థాయిలో ఎంపీడీవో పంచాయతీ రాజ్, ఉపాధిహామీపదకం, స్థానిక గ్రామ సచివాలయ స్టాఫ్, ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాల ప్రగతిని పరిశీలించి ఎదురవుతున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ వివరించారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం అయిన ప్లాంటేషన్ ను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం బండ్ ప్లాంటేషన్, ఉద్యానపంటలను పండించేలా రైతులను ప్రోత్సహించడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ కు వివరించారు.
 
వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్‌తో పాటు జెడ్పి సిఈఓ పి.శ్రీనివాసులు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ రాంబాబు, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్ర భాస్కర్ రెడ్డి, డి పి ఓ  కె. రమేష్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.