రైతు సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం: చెవిరెడ్డి
రైతన్న సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం పోస్టర్ ను శిల్పారామం లో చెవిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. దేశానికి వెన్నుముక అయిన రైతుకు అందించే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్ల ఇబ్బందులు, తక్కువ ఓల్టేజి సమస్యలను అధిగమించడం, ఎన్ని గంటల పాటు విద్యుత్ వినియోగిస్తున్నారు, ఎంత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామన్న విషయాలను మీటర్ల ఏర్పాటుతో తెలుసుకోవచ్చన్నారు.
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పనితీరు పట్ల నమ్మకం ఉందన్నారు. భవిష్యత్తులో మూడు దశాబ్దాల కాలం పాటు ఉచిత విద్యుత్ కు డోకా రాకుండా ఉండేందుకు పది వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎపీఎస్పీడీసీఎల్ తిరుపతి ఈఈ కృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ ఓ ఎస్ డీ రంగస్వామి, తిరుపతి రూరల్ తాహసీల్దార్ కిరణ్ కుమార్, ఏఈలు హరిప్రసాద్ రెడ్డి, శేషాద్రి రెడ్డి, జనార్ధన్, ఎంఏఓ మమత తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పద్మావతి నిలయంలో ఆకస్మిక తనిఖీ
శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ లో ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా పేషంట్ల కు అందుతున్న సౌకర్యాల పట్ల వారితో నేరుగా సంభాషించారు.
రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు అందిస్తున్న ఆహారం నాణ్యత ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అలాగే నిర్దిష్ట సమయానికి అల్పాహారం, పండ్లు, కషాయం అందుతున్నాయా అంటూ ఆరా తీశారు.
పద్మావతి నిలయంలో అందుతున్న సేవల పట్ల కోవిడ్ పేషంట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా పేషంట్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు.