నిన్నటితో నూరు తప్పులు అయిపోయాయన్న నారా రోహిత్
టీడీపీ అధినేత, తన పెదనాన్న అయిన చంద్రబాబును అవమానించడంపై నారా రోహిత్ ఘాటుగా స్పందించాడు. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన అవమానంపై సినీ నటుడు నారా రోహిత్ మాట్లాడుతూ, పశువుల కంటే హీనంగా కొందరు నేతలు ప్రవర్తించారంటూ అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని అసభ్యపదజాలంతో దూషించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని నారా రోహిత్ అన్నారు. విధానాలపై రాజకీయ విమర్శలు ఉండాలి గానీ, కుటుంబ సభ్యులను అందులోకి లాగడం క్షమించరానిదన్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం హక్కును దుర్వినియోగపరిచేలా నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు.
అయినా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం వారి భ్రమే అవుతుందన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నారని, అందుకే వారి మనుగడ సాగిందని అన్నారు. శిశుపాలుడిలాగే నిన్నటితో వారి వంద తప్పులు పూర్తయ్యాయని, వారి అరాచకాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. ప్రతి ఒక్క తెలుగు దేశం కార్యకర్త వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని రోహిత్ హెచ్చరించారు.