అగ్ని ప్రమాదం.. 42 మంది మృతి : అల్జీరియా అడవుల్లో ఘోరం
ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా ఘోర ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో 25 మంది సైనికులతో మొత్తం 42 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ధ్రువీకరించారు.
ఈ దేశంలోని బెర్బర్స్ పర్వతం, కబైలీ ప్రాంతంలోని అడవుల్లో మంటలు వ్యాపించగా.. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని ఆర్మీ మంగళవారం అర్థరాత్రి ట్వీట్ చేసింది. మంటలను అదుపు చేస్తున్న క్రమంలో 25 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
మరో ఏడుగురికి గాయాలైనట్లు జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కనీసం మరో ఏడుగురు పౌరులు మృతి చెందారని అంతర్గత మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు పేర్కొంది. కబైలీ ప్రాంతంలో, పలుప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.
అయితే, అడవుల్లో మంటలు చెలరేగడంపై కుట్ర జరిగి ఉండొచ్చని ఇంటీరియర్ మినిస్టర్ అనుమానం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. బాధితులకు పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి 13 ప్రావిన్స్‌ల్లో మంటలు చేలరేగగా అడవులు కాలిబూడిదవుతున్నాయి.