#PulwamaAttack ఘటనకు రెండేళ్లు ... అమరవీరులకు నివాళులు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడి ఘటన జరిగి నేటి(ఫిబ్రవరి 14వ తేది)కి రెండేళ్లు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను దేశం స్మరించుకుంటుంది. దేశ రక్షణ, భద్రతలో తమ ప్రాణాలను వదిలిన సైనికులకు యావత్ భారతావని సెల్యూట్ చేస్తోంది.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా, 78 వాహనాల్లో 2500 మంది సైనికులు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ అనే ఆత్మాహుతి బంబార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) హోదాను భారత్ ఉపసంహరించింది. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఇది భారత్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి.
ఈ ఎయిర్ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్థాన్ దాడికి ప్రయత్నించగా.. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఈ క్రమంలో పాక్ విమానాలను వెంబడిస్తూ వెళ్లిన యుద్ధ విమానం కూలడంతో వింగ్ కమాండర్ అభినందన్ పాక్‌కు చిక్కాడు. అనంతరం అనేక దౌత్య చర్చల అనంతరం అభినందన్‌ను పాక్ క్షేమంగా భారత్‌కు అప్పగించింది.
ఇదిలావుంటే, పుల్వామా ఘటన జరిగి రెండేళ్లు నిండిన సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అమరసైనికులకు నివాళులర్పించాడు. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో అమర సైనికులను గుర్తు చేసుకుంటూ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాలను కొనియాడారు.