బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (12:27 IST)

సరిహద్దుల్లో ఘర్షణ : 20 మంది చైనా సైనికులకు గాయాలు

సరిహద్దుల్లో మళ్లీ భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 20 మందికిపై చైనా సైనికులు గాయపడినట్టు సమాచారం. నిజానికి ఇరు దేశాల మధ్య నెలకొనివున్న ఉద్రిక్తతలను తొలగించేందుకు ఇరు దేశాల అధికారులు తొమ్మిదో దఫా చర్చలు జరుపుతున్నారు. 
 
ఈ క్రమంలో చైనా బలగాలు స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఘర్షణాత్మక వైఖరికి దిగాయి. ముఖ్యంగా, సరిహద్దులను దాటి భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు చైనా సైనికులు ప్ర‌య‌త్నించారు. గతవారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి మీడియాకు ఆల‌స్యంగా స‌మాచారం అందింది.
 
చైనా సైనికుల చొర‌బాటును గుర్తించిన‌ భార‌త జ‌వాన్లు వెంట‌నే స్పందించి, ధీటుగా వారి ప్ర‌య‌త్నాల‌ను  తిప్పికొట్టారు. ఉత్త‌ర‌ సిక్కింలోని నాకూ లాలో స‌రిహద్దుల వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార‌త జ‌వాన్ల ధాటికి 20 మంది చైనా సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.
 
అలాగే, న‌లుగురు భార‌త జ‌వాన్లకూ గాయాల‌యిన‌ట్లు తెలిసింది. దీంతో ఆ  ప్రాంతంలో  ఉద్రిక్త‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. సిక్కింలోని ఇదే ప్రాంతంలో 2020, మే9న కూడా చైనా దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌గా భార‌త సైన్యం వారిని త‌రిమికొట్టింది. అప్ప‌ట్లోనూ ఇరు దేశాల సైనికులు గాయ‌ప‌డ్డారు.