శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (12:17 IST)

బరితెగించిన చైనా.. అరుణా చల్ ప్రదేశ్‌లో గ్రామాన్నే నిర్మించింది..!

చైనా బరితెగించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా  గ్రామాన్నే నిర్మించింది. భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి సుభాన్‌సిరి జిల్లాలో తారి చూ నది ఒడ్డున ఓ ఊరును కట్టేసింది. శాటిలైట్‌ ద్వారా తీసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. చైనా నిర్మించిన ఆ ప్రాంతంలో 101 ఇళ్లు ఉన్నట్టు తెలిసింది. 2019 ఆగస్టు 26న తీసిన ఫొటోల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి ఇండ్లు, నిర్మాణాలు కనిపించలేదు.
 
తాజాగా గత నవంబర్‌ 1న తీసిన శాటిలైట్‌ ఫొటోల్లో ఇండ్లు నిర్మించినట్టు తెలిసింది. ఈ వివరాలన్నీ ఓ మీడియా చానల్‌ తాజాగా బయటపెట్టింది. సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక మ్యాప్‌లోనూ ఇండియా భూభాగంలో చైనా గ్రామం ఉందని తెలుస్తోంది.
 
అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా దురాక్రమణలపై అక్కడి బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ లోక్‌సభలో కిందటి ఏడాది నవంబర్‌లోనే ప్రస్తావించారు. అప్పర్‌ సుభాన్‌సిరి జిల్లా గురించే ఆయన ప్రస్తావించారు. కొత్త గ్రామం విషయమై తాజాగా ఎంపీని ప్రశ్నించగా ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. 
 
సుభాన్‌సిరి ప్రాంతంలో సరిహద్దు నుంచి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర మన భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందని, నది వెంబడి వెళితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. స్థానికంగా లెన్సీ అని పిలిచే ఓ నది వెంబడి కూడా చైనా ఓ రోడ్డు నిర్మిస్తోందని వివరించారు.
 
చైనా కొత్త గ్రామంపై ఇండియన్‌ ఫారిన్‌ మినిస్ట్రీ స్పందించింది. బార్డర్‌ వెంబడి కదలికలను గమనిస్తున్నామని చెప్పింది. 'సరిహద్దు దగ్గర చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోందని మా దృష్టికి వచ్చింది. గతంలోనూ అనేకసార్లు చైనా ఇలాంటి పనులు చేసింది' అని కామెంట్‌ చేసింది. సరిహద్దుల్లో కొత్త గ్రామం విషయంపై చైనాను నిలదీస్తారా అని అడగ్గా.. బార్డర్‌ వెంబడి చైనా నిర్మాణాలను ఇండియా ఎప్పటికప్పుడు గమనిస్తోందని, ఇండియా సార్వభౌమత్వం దెబ్బతినే పరిస్థితి ఏర్పడితే అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటామని చెప్పింది.  
 
చైనా నిర్మించిన గ్రామం లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌(ఎల్‌ఏసీ)కు దక్షిణాన ఉందని, ఇది చాలాకాలంగా వివాదాస్పద ప్రాంతమని, సరిహద్దులోని ఇతర ప్రాంతాలపైనా దీని ప్రభావం ఉంటుందని ఇండియా -చైనా వ్యవహారాల ఎక్స్‌పర్ట్‌ క్లాడ్ ఆర్పీ చెప్పారు.