శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (16:28 IST)

కరోనా మూలాలు కనుగొనేందుకు వెళ్లిన డబ్లూహెచ్‌వో నిపుణులకు క్వారంటైన్!

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ చైనాలోని వూహన్ నగరంలో వెలుగు చూసింది. ఈ వైరస్ మూలాలను కనుగొనేందుకు వూహాన్ నగరంలో అడుగుపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టుల బృందం ఒకటి చైనా క్వారంటైన్ విధించింది. దీంతో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
2019, డిసెంబర్‌లో తొలిసారి వుహాన్‌లోనే క‌రోనా వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. అస‌లు అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందన్న విష‌యం తెలుసుకోవ‌డానికి ఈ 10 మంది సైంటిస్టులు సింగ‌పూర్ నుంచి నేరుగా వుహాన్ చేరుకున్న‌ట్లు చైనా అధికార మీడియా ధృవీక‌రించింది. 
 
అయితే ద‌ర్యాప్తు మొద‌లుపెట్ట‌డానికి ముందు చైనా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఈ డ‌బ్ల్యూహెచ్‌వో టీమ్ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ క్వారంటైన్ స‌మ‌యంలోనే సైంటిస్టులు.. చైనా మెడిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడ‌నున్నారు. 
 
నిజానికి చాలా రోజుల కింద‌టే ఈ టీమ్ వుహాన్‌కు రావాల్సి ఉన్నా.. చైనా ప్ర‌భుత్వం మాత్రం అనుమ‌తి నిరాక‌రించింది. వుహాన్‌లోనే క‌రోనా పుట్టింద‌న్న వాద‌న‌ను చైనా ఖండిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ పుట్టిన మార్కెట్ ఏడాది కాలంగా మూత‌ప‌డే ఉంది. అలాగే, వూహాన్ నగరంలో ఇపుడు మునుపటి సందడి కనిపించడం లేదు.