శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (15:16 IST)

అకౌంట్లో రూ. 1.18 లక్షలు.. అంత్యక్రియల కోసం బ్యాంకుకు శవం..

అనాధగా మారిన 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. పాట్నాకు చెందిన ఈ వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగానే జీవిస్తున్నాడు. కానీ ఆయన మృతి చెందడంతో అంత్యక్రియలు ఎవరు చేయాలి? డబ్బులు ఎక్కడ్నుంచి తేవాలి? అనే ప్రశ్న గ్రామస్తుల్లో వాదన మొదలైంది. దీంతో ఆ కూలీ ఇంటినంతా గాలించారు. ఎక్కడా ఒక్క పైసా కూడా దొరకలేదు. చివరకు బ్యాంకు ఖాతా పుస్తకం కనిపించింది. ఆ ఖాతా బుక్‌ను పరిశీలించగా.. అకౌంట్లో రూ. 1.18 లక్షలు ఉన్నట్లు గుర్తించారు.
 
కూలీ అంత్యక్రియలకు డబ్బుల కోసం గ్రామస్తులంతా కలిసి మృతదేహాన్ని తీసుకొని బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఆయన ఖాతాలో ఉన్న డబ్బుల్లో రూ. 20 వేలు ఇవ్వాలని, వాటితో అంత్యక్రియలు నిర్వహిస్తామని బ్యాంకు అధికారులను గ్రామస్తులు కోరారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం వారి ప్రతిపాదనను తిరస్కరించారు. కచ్చితంగా కూలీ సంతకం లేదా నామినీ వస్తేనే డబ్బులు డ్రా చేయొచ్చు అని స్పష్టం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు వినిపించుకోకుండా బ్యాంకు వద్ద నిరసన వ్యక్తం చేశారు.
 
చివరకు బ్యాంకు మేనేజర్ కల్పించుకొని.. సీఎస్ఆర్ ఫండ్ కింద కూలీ అంత్యక్రియలకు రూ.10 వేలు అందజేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.5 వేలు ఇచ్చాడు. మొత్తం రూ. 15 వేలతో కూలీ అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు.