బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:49 IST)

రైతు ట్రాక్టర్‌ను దొంగతనంగా తీసుకెళ్లిన ఫైనాన్స్ వ్యాపారి

మంగళగిరి మండలంలో ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకూ శృతిమించిపోతోన్నాయి.  ఇటీవల మండలంలోని యర్రబాలెంలో వాలంటీర్ పైన వడ్డీ వ్యాపారి దౌర్జన్యం చేసి ద్విచక్ర వాహనాన్ని బలవంతంగా లాక్కొని వెళ్లగా... తాజాగా మండలంలోని కురగల్లులో ఓ రైతు ట్రాక్టర్‌ను ఫైనాన్స్ వ్యాపారి  దొంగిలించి మరీ తీసుకుపోయాడు.

వివరాల ప్రకారం... మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన టి. దుర్గారావు అనే రైతు ట్రాక్టర్ కొనుగోలు నిమిత్తం గత కొన్ని నెలల క్రితం మంగళగిరి పట్టణానికి చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ యజమాని వద్ద నుంచి రూ.2,00,000/- ఫైనాన్స్ తీసుకున్నాడు. అదే సమయంలో చేతి ఖర్చుల నిమిత్తం మరో రూ.50 వేలను తీసుకుని  కొన్ని రోజులకు వడ్డీతో సహా చెల్లించాడు.

ఈ ట్రాక్టర్ కొనుగోలు నిమిత్తం తీసుకున్న రెండు లక్షలకు 16 కిస్తీలకు, కిస్తీ ఒక్కింటికీ రూ.16,500ల చొప్పున  11 నెలల పాటు రూ.1,81,500 చెల్లించాడు. ఈ నేపధ్యంలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మిగిలిన 5 కిస్తీలను సమయానికి చెల్లించలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ వ్యాపారి ఇంకా తనకు రూ.2.50 లక్షలు చెల్లించాలని రైతు దుర్గారావుపై ఒత్తిడి తెస్తోన్నాడు. 

వాస్తవానికి దుర్గారావు చెల్లించాల్సింది నెలకు రూ.16,500/- చొప్పున 5 నెలలకు రూ. 82,500 బాకీ మాత్రమే. ఆలస్యం కావడంతో బాకీ నిమిత్తం రూ. లక్ష చెల్లిస్తానని ఫైనాన్స్ వ్యాపారిని బ్రతిమిలాడుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. తనకు రూ.2 50 లక్షలు చెల్లించాలని, లేకుంటే ట్రాక్టర్‌ను తీసుకువెళతానని బెదిరించాడు.

ఈ నేపధ్యంలో దుర్గారావు తన వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం ఇంట్లో లేని సమయంలో ఫైనాన్స్ వ్యాపారి ట్రాక్టర్‌ను తీసుకువెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితుడు దుర్గారావు తన ఇంట్లో పార్కింగ్ చేసిన ట్రాక్టర్‌ను ఫైనాన్స్ వ్యాపారి దొంగతనంగా తీసుకువెళ్లినట్లు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.