వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. టీడీపీ కండువా కప్పుకున్న ఆళ్ల నాని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల నాని అధికారికంగా పార్టీలో చేరారు. ఆళ్ల నాని ఉండవల్లికి వెళ్లి, అధికారికంగా పార్టీలో చేరడానికి ముందు చంద్రబాబు నాయుడును కలిశారు.
ఆళ్ల నానిని చంద్రబాబు నాయుడు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇంకా పార్టీ కండువా కప్పి టీడీపీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సుజయ్ కృష్ణ రంగారావు సహా పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత నుంచి వైసీపీకి దూరంగా ఉన్న ఆళ్ల నాని.. ఎట్టకేలకు గతేడాది చివర్లోనే వైసీపీకి గుడ్‌బై చెబుతూ పార్టీకి.. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి స్థానిక నాయకత్వం అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఆలస్యం అయింది.