బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:04 IST)

పెద్దిరెడ్డి వద్ద అణిగిమణిగి ఉంటేనే పదవులు, వైకాపాకు రాజీనామా: మాజీ ఎమ్మెల్యే గాంధీ

ysrcp flag
వైకాపాలోని సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద అణిగిమణిగి ఒక బానిసలా ఉంటేనే వైకాపాలో పదవులు వస్తాయని మాజీ ఎమ్మెల్యే గాంధీ ఆరోపించారు. అలాంటి పదవులు తనకు అక్కర్లేదని ప్రకటించిన ఆయన.. వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. వైకాపాలో దళితులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తన పదవికి, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైకాపా పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆర్‌.గాంధీ ప్రకటించారు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులు, బీసీలపై దాడులు పెరగడంతో పాటు రాజకీయంగా ఆ వర్గాలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన చిత్తూరు జిల్లా ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, 'నేను దళితుడిని కావడం వల్లనే పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. నియోజకవర్గ సమస్యలను సీఎం జగన్‌కు విన్నవించడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం కార్యాలయ అధికారులను వేడుకున్నా స్పందించక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యా. నాకు గౌరవం, పదవులు దక్కకుండా పెద్దిరెడ్డి అడ్డుపడ్డారు. 
 
ఆయన వద్ద అణిగి ఉంటేనే పదవులు, గౌరవం దక్కుతాయి. ఏరోజూ ఎంపీ రెడ్డెప్ప.. పెద్దిరెడ్డి ముందు కూర్చోలేదు. ఓ ఎంపీకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య దళిత నాయకులు, కార్యకర్తలకు ఏం గౌరవం ఉంటుంది. వైకాపా కుల రాజకీయాలతో విసిగిపోయా. అందుకే మంగళవారం గంగాధర నెల్లూరులో జరిగే 'రా..కదలిరా' కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నా' అని మాజీ ఎమ్మెల్యే గాంధీ వెల్లడించారు.