శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (18:37 IST)

ఆంధ్రప్రదేశ్‌ని వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా.. జేసీ దివాకర్ రెడ్డి

ఏపీకి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. శాసన సభా సమావేశాల సందర్భంగా ఆయన అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీలో పాత మిత్రులను కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ను దివాకర్‌ రెడ్డి కలిశారు. 
 
ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు బాగాలేవు, సమాజం కూడా బాగోలేదని చెప్పారు. ఏపీ కన్నా తెలంగాణలో రాజకీయాలు బాగున్నాయని తెలిపారు. తాను ఆంధ్రప్రదేశ్‌ని వదిలేసి తెలంగాణకు వస్తానని వెల్లడించారు. 
 
తెలంగాణను వదిలిపెట్టడంతో చాలా నష్టపోయానని వ్యాఖ్యానించారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానని అన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఇక, హుజూరాబాద్‌ ఉపఎన్నిక గురించి తనకు తెలియదని జేసీ చెప్పారు.  
 
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిశారు జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక తాను కేసీఆర్‌ని కలవలేదని.. అందుకే కలుద్దామని వచ్చినట్లు చెప్పారు. సీఎం బాగోగులు అడిగి తెలుసుకున్నానన్నారు జేసీ. తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
 
ఏపీ కంటే తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకున్నారు. రాజకీయ అంశాలు పక్కనబెడితే.. తాను రాయల తెలంగాణ కోరుకున్నానని చెప్పారు జేసీ. రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే.. అందరం బాగుండే వాళ్లమన్నారు.