బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (20:46 IST)

ఐఏఎస్‌లపై బదిలీవేటు... కాంట్రాక్టులు రద్దు.. సీఎం జగన్ సర్కారు షాక్

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై బదిలీవేటు వేసింది. 
 
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారులో ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు అత్యంత కీలకంగా వ్యవహరించారు. వీరిలో సీఎం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సతీశ్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శులు గిరిజా శంకర్, రాజమౌళిలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ చేశారు. వీరంతా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు సెక్రటరీగా కె. ధనుంజయ్ రెడ్డిని నియమించారు.
 
ఇదిలావుంటే, ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులను తక్షణం నిలిపివేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఇంజినీరింగ్ పనుల కారణంగా ఖజానాపై పెనుభారం పడిందన్నారు. ప్రభుత్వ పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుకు సంబంధించి స్పష్టతనిస్తూ సీఎస్ కొద్దిసేపటి క్రితం మెమో జారీచేశారు.
 
ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను పట్టించుకోకుండా చేసిన పనులతో రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన ప్రాజక్టు పనుల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ యేడాది ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరైనా, ఇంకా ప్రారంభించని పనులు ఏవైనా పనులు ప్రారంభించకుండా ఉంటే వాటిని రద్దు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. 25 శాతం పనులు పూర్తవని ప్రాజక్టుల విలువను నిర్ధారించాలని, వాటికి తదుపురి బిల్లుల చెల్లింపులు జరిపేటపుడు ఉన్నతస్థాయి అధికారుల అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. 
 
ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమంతోపాటు అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని నూతన ప్రభుత్వ విధానాన్ని తెలిపారు. అన్ని శాఖల అధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని విధాలా ధృవీకరణ జరిగిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి వివరించారు.